అబ్బే.. వాటితో కేన్సర్‌ రాదు!

3 Nov, 2018 01:15 IST|Sakshi

మొబైల్‌ ఫోన్లు, టవర్ల ప్రభావం మానవులపై ఉండదు..

మగ ఎలుకల్లోనే కేన్సర్‌ వచ్చే అవకాశమంటున్న పరిశోధనలు

5జీ తరంగాలతో ఎలాంటి హాని ఉండదని స్పష్టీకరణ 

మొబైల్‌ఫోన్‌ ఎక్కువగా వాడితే కేన్సర్‌ వస్తుందట! ఇంటిపైకప్పులపై ఉండే టవర్లతో తలనొప్పులు.. కేన్సర్లు! ఇలాంటి వార్తలు చూసి బెంబేలెత్తిపోయారా? ఇకపై అలా భయపడాల్సిన అవసరం లేదంటోంది అమెరికా ప్రభుత్వపు నేషనల్‌ టాక్సికాలజీ ప్రోగ్రామ్‌! మగ ఎలుకల్లో కొన్ని రకాల కేన్సర్లకు మొబైల్‌ రేడియోధార్మికత కారణమవుతున్నా.. మనుషుల దగ్గరికొచ్చేసరికి ఇది అసాధ్యమని ఈ సంస్థ శాస్త్రవేత్తలు తేల్చేశారు. సుమారు పదేళ్ల పాటు అధ్యయనం జరిపి మరీ తాము ఈ నిర్ధారణకు వచ్చామని చెబుతున్నారు. 

మొబైల్‌ఫోన్లకు కేన్సర్‌కు ఉన్న లింకుపై నిగ్గు తేల్చేందుకు అమెరికన్‌ నేషనల్‌ టాక్సికాలజీ ప్రోగ్రామ్‌ పదేళ్ల కింద ఒక పరిశోధన చేపట్టింది. కొన్ని మగ ఎలుకలను రేడియోధార్మికతకు గురిచేసి పరిశీలనలు జరిపారు. 2జీ, త్రీజీ ఫోన్ల నుంచి వెలువడే 900 మెగాహెర్ట్‌జ్‌ కంటే 4 రెట్లు ఎక్కువ తీవ్రతతో కూడిన రేడియో తరంగాలను ఎలుకలపై ప్రయోగించినప్పుడు గుండె, మెదడుతో పాటు కొన్ని ఇతర గ్రంథుల్లో కేన్సర్‌ కణితులు ఏర్పడ్డాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మెక్‌కాన్వే అంటున్నారు. అయితే అన్ని రకాల ఎలుకల్లోనూ ఇదే రకమైన ఫలితాలు కనిపించకపోవడం.. ఆడ ఎలుకల్లోనూ వేరుగా ఉండటం గమనార్హం. 

4జీతో తక్కువ అవకాశం.. 
స్మార్ట్‌ఫోన్లలో అధిక పౌనఃపున్యమున్న రేడియో తరంగాలను వాడుతుంటారు. 2జీ, 3జీలలో ఇది 900 మెగాహెర్ట్‌జ్‌గా ఉంటే.. 4జీలో ఈ పౌనఃపున్యం మరింత ఎక్కువగా ఉంటుంది. అధిక పౌనఃపున్యమున్న రేడియో తరంగాలు శరీరం లోపలికి చొచ్చుకుపోయే అవకాశాలు తక్కు వని శాస్త్రవేత్తలు అంటున్నారు. మొబైల్‌ఫోన్ల కంటే చాలా ఎక్కువ రెట్లు తీవ్రతతో కూడిన రేడియో తరంగాలు కొన్ని రకాల ఎలుకల్లో.. ముఖ్యంగా మగ ఎలుకల్లో కేన్సర్‌ కణితులు ఏర్పడేందుకు కారణం కావచ్చు.  

>
మరిన్ని వార్తలు