మేకలకు ఏడాది జైలు శిక్ష! ఏం తప్పు చేశాయో వింటే షాకవ్వుతారు!

12 Dec, 2023 12:07 IST|Sakshi

మనుషులకు విధించినట్లు జంతువులకు జైలు శిక్షలా అనిపిస్తుంది కదా! కానీ ఆ దేశం జంతువులకు శిక్ష విధించి వార్తల్లో నిలిచింది. ఏం తప్పు చేశాయని అంత పెద్ద శిక్ష విధించారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇదేం విడ్డూరం రా బాబు అనుకోకండి. ఇలాంటి అక్కడ మాములేనట. పాపం ఆ మేకలు ఏకంగా ఏడాదికి పైగా జైలు శిక్ష అనుభవించాయి. 

వివరాల్లోకెళ్తే..ఈ వింత ఘటన బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంది. షహరియార్‌ సచిబ్‌ రాజీబ్‌కి చెందిన తొమ్మిది మేకులడిసెంబర్‌ 6, 2022న స్మశాన వాటికలో చెట్ల ఆకులు, గడ్డి తిన్నాయని అరెస్టు చేశారు అధికారులు. అలా అప్పటి నుంచి బారిసాల్‌లో బార్‌ల వెనుక ఆ మేకలు బంధీలుగా ఉండిపోయాయి. వాటి యజమాని వాటిని విడుదల చేసేందుకు పలు విధాల యత్నించి ప్రయోజనం లేకుండా పోయింది. అయితే ఇటీవలే ఎన్నికైన బరిషల్‌ సిటీ కార్పొరేషన్‌ మేయర్‌ని సంప్రదించి తన గోడును చెప్పుకున్నాడు.

దీంతో ఆయన చొరవ కారణంగా బంగ్లాదేశ్‌ అడ్మనిస్ట్రేటివ్‌ అదికారులు రాజీబ్‌కు తొమ్మిది మేకలను విడుదల చేసి తిరిగి అప్పగించారు. దాదాపు ఏడాదికి పైగా జైలు శిక్ష అనుభవించి ఇటీవలే బంధిఖానా నుంచి విముక్తి పొందాయి ఆ తొమ్మిది మేకలు. ఇలా జంతువులకు శిక్ష విధించిన ఘటన మొదటిది కాదు. రష్యాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. కోమి ప్రావిన్స్‌లో సిక్టివ్‌కర్ నగరంలోని జైలులో ఓ పిల్లి అక్రమంగా ఫోన్‌లు, గాడ్జెట్‌లు రవాణ చేస్తుందని అరెస్టు చేసి బంధించారు. అలాగే ఉత్తరప్రదేశ్‌ల్‌లో కూడా ఇలాంటి విచిత్ర ఘటనే చోటు చేసుకుంది. ఓ ఎనిమిది గాడిదలు లక్షలు విలువ చేసే మొక్కలను తినేశాయని అరెస్టు చేసి జైల్లో పడేశారు.

(చదవండి: ఆ లాటరీ టికెట్‌ వెయిటర్‌ జీవితాన్ని తలకిందులు చేసి చిక్కుల్లో పడేసింది!)

(మరిన్ని వార్తల కోసం సాక్షి వాట్సాప్‌ ఛానెల్‌పై క్లిక్‌ చేయండి)

>
మరిన్ని వార్తలు