మమ్మల్ని రెచ్చగొట్టొద్దు

15 Mar, 2019 04:58 IST|Sakshi

మసూద్‌ను రక్షిస్తున్న చైనాకు అగ్రరాజ్యాల హెచ్చరిక

అతడిని అడ్డుకునేందుకు మేం రంగంలోకి దిగేదాకా పరిస్థితి తేవొద్దని అల్టిమేటం

వాషింగ్టన్‌/బీజింగ్‌/న్యూఢిల్లీ: జైషే మొహమ్మద్‌ ఉగ్ర సంస్థ అధినేత పాక్‌కు చెందిన మసూద్‌ అజార్‌ను వెనకేసుకు రావద్దని చైనాకు అగ్రరాజ్యాలు గట్టి హెచ్చరిక జారీ చేశాయి. అతడిని కట్టడి చేసేందుకు ఇతర చర్యలు తీసుకునే పరిస్థితి కల్పించవద్దని స్పష్టం చేశాయి. మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఫిబ్రవరి 27వ తేదీన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బుధవారం చైనా సాంకేతిక కారణాలతో వీటో చేసిన విషయం తెలిసిందే. చైనా చర్యను అగ్రరాజ్యాలు ఖండించాయి. ‘మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా ఇదేవిధంగా అడ్డుకోవడం కొనసాగిస్తే, మండలిలోని మిగతా సభ్య దేశాలు ఇతర చర్యలను తీసుకునే అంశాన్ని తప్పనిసరిగా పరిశీలిస్తాయి. పరిస్థితిని అక్కడిదాకా తీసుకురానివ్వద్దు. మసూద్‌కు సంబంధించి చైనా ఇలా అడ్డుపుల్ల వేయడం పదేళ్లలో ఇది నాలుగోసారి’ అని ఓ సీనియర్‌ దౌత్యాధికారి తెలిపారు.

చైనా వస్తువులను బహిష్కరించాలి
చైనా వస్తువులను బహిష్కరించాలంటూ ట్విట్టర్‌ వేదికగా పలువురు ప్రముఖులు తమ గళం వినిపిస్తున్నారు. ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ కూడా వీరిలో ఉన్నారు. ‘ఉగ్రవాది మసూద్‌ అజార్‌ మద్దతుదారులను, చైనాను మనం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెంటనే వెలివేయాలి. చైనాకు వ్యాపారమే ముఖ్యం. అందుకే ఆ దేశాన్ని ఆర్థికంగా వెలివేయడం యుద్ధం కంటే కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది’ అని రాందేవ్‌ పేర్కొన్నారు.

శాశ్వత పరిష్కారం కోసమే: చైనా
మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా పలుమార్లు అడ్డుకున్న చైనా గురువారం తన చర్యను సమర్థించుకుంది. ’ఆంక్షల కమిటీ ఈ విషయంలో మరింత లోతైన పరిశీలన చేయడానికి మా చర్య దోహదపడుతుంది. సంబంధిత వర్గా(భారత్‌–పాక్‌)లు చర్చలు సాగించి అందరికీ ఆమోదయోగ్యమైన శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ఇది సాయపడుతుంది’ అని గురువారం చైనా పేర్కొంది.

ఢిల్లీలో మసూద్‌ బస
అజార్‌ 1994 ప్రాంతంలో ఢిల్లీలోని పలు హోటళ్లలో బస చేయడంతోపాటు కశ్మీర్‌ సహా పలు రాష్ట్రాలు పర్యటించి, ఉగ్ర నేతలను కలిశాడు. ఢిల్లీలోని అత్యంత ఖరీదైన చాణక్యపురిలోని హోటల్‌ అశోక్‌లోనూ ఉన్నాడు. తన పూర్వీకులు గుజరాతీలని అధికారులకు చెప్పి పోర్చుగల్‌ నకిలీ పాస్‌పోర్టుతో బంగ్లాదేశ్‌ నుంచి దేశంలోకి ప్రవేశించాడు. కశ్మీర్‌లో అనూహ్యంగా పోలీసులకు చిక్కాడు. ఆ సందర్భంగా జరిగిన విచారణలో పోలీసులకు ఈ వివరాలు వెల్లడించాడు. ఇతడితోపాటు భారత్‌ జైళ్లలో ఉన్న మరికొందరు ఉగ్ర నేతలను తప్పించేందుకే ముష్కరులు ఎయిరిండియా విమానాన్ని హైజాక్‌ చేసి అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌కు తీసుకెళ్లారు. చివరికి భారత ప్రభుత్వం వారి డిమాండ్లకు తలొగ్గి, మసూద్‌ సహా పలువురు టెర్రరిస్టులను దేశం వెలుపలికి పంపించాల్సి వచ్చింది.

>
మరిన్ని వార్తలు