వైద్యశాస్త్రంలోనే వింత ఘటన.. చనిపోయిన తర్వాత ఎలా సాధ్యం?

15 Dec, 2023 15:51 IST|Sakshi

వైద్య శాస్త్రంలో ఇదో అద్భుతమని చెప్పాలి. గుండెపోటుతో ఓ మహిళ చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. అయితే ఆశ్చర్యంగా ఆమె 24 నిమిషాల తర్వాత లేచి కూర్చుంది. ఈ వింత ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఈ పరిణామంతో డాక్టర్లు సైతం షాక్‌కి గురయ్యారు. తాను స్పృహలో లేని ఆ 24 నిమిషాల్లో తనకు ఎలాంటి అనుభూతి ఎదురయ్యిందో  తాజాగా ఆమె సోషల్‌ మీడియాలో పంచుకుంది.

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడో, అనుకోని పరిస్థితుల్లో చచ్చి బతికాం అనే సామెతను వాడుతుంటారు. అంటే చావు అంచుల దాకా వెళ్లి ప్రాణాలతో బయటపడ్డప్పుడు ఇలా అంటుంటారు. కానీ అమెరికాకు చెందిన లారెన్‌ కెనడే అనే మహిళ మాత్రం చచ్చి బతికింది. తనకు ఎదురైన ఈ విచిత్ర అనుభవం గురించి లారెన్ నెటిజన్లతో ఈ విధంగా పంచుకుంది.

''గత ఫిబ్రవరిలో నాకు గుండెపోటు వచ్చింది. ఆంబులెన్స్‌కి కాల్‌ చేసి ఆలోగా నాకు సీపీఆర్‌ చేశాడు. కానీ ఎలాంటి చలనం లేదు. హాస్పిటల్‌కి వెళ్లగానే నన్ను పరిశీలించిన అనంతరం నేను చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. కానీ సరిగ్గా 24 నిమిషాల అనంతరం నా గుండె మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించింది. అయితే వెంటనే కోమాలోకి వెళ్లిపోయాను.

రెండు రోజులకు గానీ స్పృహలోకి రాలేదు. మెదడుకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాక సాధారణ స్థితికి వచ్చాను. దాదాపు 9 రోజుల పాటు ఐసీయూలో వైద్య బృందం నన్ను పరీక్షించింది. మరణం అంచుల వరకు వెళ్లొచ్చాను. ఇప్పుడు నాకు చావు అంటే ఏమాత్రం భయం లేదు.హార్ట్‌ ఎటాక్‌కి గురైనప్పుడు సరైన సమయంలో నా భర్త సీపీఆర్‌ చేయడం వల్ల నా ప్రాణాలు దక్కాయి. తను ఎప్పటికీ నా హీరో'' అంటూ ఆమెపేర్కొంది.

లారెన్‌కు ఎదురైన ఈ పరిస్థితిని వైద్య శాస్త్రంలో లాజరస్ ఎఫెక్ట్ అని అంటారు.అంటే చనిపోయిన సందర్భంలో చాలా అరుదుగా ఇలా మళ్లీ జీవం పోసుకోవడం జరుగుతుంది. అయితే ఇలాంటి కేసుల్లో మళ్లీ బతికిన వారు ఎక్కువ కాలం జీవించలేరని, అయితే లారెన్‌ కేసు ఆశ్చర్యంగా ఉందని న్యూయార్క్‌ పోస్ట్‌ పేర్కొంది. గతంలో 1982 నుంచి 2018 మధ్య ఇలాంటి కేసులు 65 నమోదయ్యాయని,అందులో 18 మంది మాత్రమే పూర్తిగా కోలుకున్నారని స్పష్టం చేసింది.

>
మరిన్ని వార్తలు