20 లక్షల వ్యాక్సిన్‌ డోస్‌లు రెడీ

7 Jun, 2020 04:48 IST|Sakshi

పరీక్షలు పూర్తయ్యాక పంపిణీ: ట్రంప్‌

వాషింగ్టన్‌: తమ దేశం 20 లక్షల కరోనా వ్యాక్సిన్‌ డోసుల్ని సిద్ధం చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. రక్షణ పరమైన పరీక్షలు పూర్తి చేశాక వాటిని సరఫరా చేస్తామని చెప్పారు. శుక్రవారం వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్‌ వ్యాక్సిన్‌ విషయంలో అమెరికా అద్భుతమైన పురోగతిని సాధించిందని అన్నారు. కోవిడ్‌ చికిత్సా విధానంలో కూడా అమెరికా మంచి పురోగతి సాధించిందని అన్నారు. ట్రంప్‌ అధికార యంత్రాంగం కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి 5 కంపెనీలను ఎంపిక చేసినట్టుగా న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించింది.  (ఇటలీని దాటేసిన భారత్‌) 

పరస్పర వ్యతిరేక వ్యాఖ్యలు  
కరోనా వ్యాక్సిన్‌ అంశంలో అమెరికా ప్రభుత్వం చెబుతున్నదానికి, పరిశోధకులు చెబుతున్న మాటలకి పొంతన లేదు. అమెరికా ప్రభుత్వ యంత్రాంగానికి కరోనా వైరస్‌పై పూర్తి స్థాయిలో అవగాహన వచ్చిందని ట్రంప్‌ అంటుంటే, పరిశోధకులు మానవ శరీరంలోకి వైరస్‌ ప్రవేశించాక వారి రోగ నిరోధక శక్తి వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇంకా స్పష్టత రాలేదని అంటున్నారు. (ముగ్గురు న్యాయమూర్తులకు కరోనా.. హైకోర్టుకు తాళం)

భారత్‌ పరీక్షలు చేస్తే మరిన్ని కేసులు
చైనా, భారత్‌ మరిన్ని కరోనా పరీక్షలు నిర్వహించి ఉండి ఉంటే అగ్రరాజ్యాన్ని మించిపోయేలా కేసులు నమోదై ఉండేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. మైన్‌లో కరోనా కిట్స్‌ తయారు చేసే ప్యూరిటన్‌ మెడికల్‌ ప్రొడక్ట్స్‌లో జరిగిన కార్యక్రమంలో ట్రంప్‌ మాట్లాడుతూ అమెరికా రెండు కోట్ల మందికి పరీక్షలు నిర్వహించిందన్నారు. జర్మనీ 40 లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తే దక్షిణ కొరియా 30 లక్షల మందికి మాత్రమే కోవిడ్‌ పరీక్షలు నిర్వహించిందని ట్రంప్‌ గుర్తు చేశారు. ఎక్కువ మందికి టెస్టులు చేస్తే, ఎక్కువ కేసులు నమోదవుతాయని అందరూ గ్రహించాలని ట్రంప్‌ అన్నారు. చైనా, భారత్, ఇతర దేశాలు ఇంకా ఎక్కువ పరీక్షలు చేసి ఉంటే, మరెన్నో కేసులు నమోదయ్యేవని ట్రంప్‌ అన్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు