డబ్ల్యూహెచ్‌ఓతో అమెరికా కటీఫ్‌

31 May, 2020 03:45 IST|Sakshi

కోవిడ్‌పై ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిందన్న ట్రంప్‌

చైనాపైనా పలు ఆంక్షలను ప్రకటించిన అగ్రరాజ్యాధినేత

వాషింగ్టన్‌: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)తో తెగదెంపులు చేసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో ప్రపంచాన్ని ఆ సంస్థ తప్పుదోవ పట్టించిందనీ, వైరస్‌ విషయంలో చైనాను బాధ్యునిగా చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ‘కోవిడ్‌ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని మేం చేసిన వినతిని డబ్ల్యూహెచ్‌ఓ పట్టించుకోలేదు. డబ్ల్యూహెచ్‌ఓకు అత్యధికంగా 45కోట్ల డాలర్ల నిధులు సమకూర్చుతుండగా చైనా 4కోట్ల  డాలర్లిచ్చి పెత్తనంచేస్తోంది.

డబ్ల్యూహెచ్‌ఓ ముందుగానే అప్రమత్తం చేసి ఉంటే, చైనా నుంచి ప్రయాణాలపై నిషేధం విధించి ఉండేవాడిని. చైనా ఒత్తిడి వల్లే అలా చేయలేదు. అందుకే ఆ సంస్థతో సంబంధాలు తెంచుకుంటున్నాం’అని తెలిపారు. ‘కోవిడ్‌తో అమెరికాలో లక్ష ప్రాణాలు బలయ్యాయి. వైరస్‌ తీవ్రతను చైనా దాచిపెట్టడంతో అది ప్రపంచంలో లక్షలమరణాలకు కారణమైంది’అంటూ చైనాపై మండిపడ్డారు. కొందరు చైనా జాతీయుల ప్రవేశంపై నిషేధంతోపాటు చైనీయులు పెట్టుబడులపై ఆంక్షలను మరింత కఠినతరం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

హాంకాంగ్‌పై పట్టు సాధించేందుకు ఇటీవల చైనా తీసుకువచ్చిన చట్టంపై ఆయన మండిపడ్డారు. దశాబ్దాలుగా ఏ దేశమూ చేయనంతగా అమెరికాను చైనా దోచుకుందని తీవ్రంగా ఆరోపించారు. చైనాతో సంబంధాల విషయంలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర విచారం కలిగిస్తున్నాయని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ‘కరోనా పుట్టుక విషయంలో దర్యాప్తునకు సహకరించాలని చైనాను కోరాం. కానీ, తిరస్కరించింది. తమ దేశంలో కోవిడ్‌ను కట్టడి చేసుకున్న చైనా.. ఇతర దేశాలకు పాకకుండా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.  దీంతో ప్రపంచమంతా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది’అని విమర్శించారు.

మరిన్ని వార్తలు