కరోనా భయాల్లో పలకరించిన భూకంపం

29 Mar, 2020 09:28 IST|Sakshi

జకార్త: మహమ్మారి కరోనా విజృంభణతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇండోనేషియా ప్రజల్ని ప్రకృతీ భయభ్రాంతులకు గురిచేసింది. అక్కడి సులవేసి ద్వీపంలో శనివారం రాత్రి 5.8 మాగ్నిట్యూడ్‌ తీవ్రతతో భూకంపం సంభవించింది. మధ్య సులవేసి ప్రావిన్స్‌కు 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెన్‌డోలో పట్ణణం వద్ద 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నిక్షప్తమై ఉందని అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది. అయితే, స్వల్పంగా నమోదైన భూకంపంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని.. సిగి జిల్లాలోని కులవి గ్రామంలో రెండు ఇళ్లు ధ్వంసం కాగా ఇద్దరు గాయపడ్డారని ఇండోనేషియా జాతీయ డిజాస్టర్‌ ఏజెన్సీ ప్రకటించింది. 
(చదవండి: ఐదు నిమిషాల్లోనే కరోనా టెస్ట్‌!)

ఇక కరోనా నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకుంటున్న తరుణంలో భూకంప భయాలు గందరగోళం సృష్టించాయి. గత అనుభవాల నేపథ్యంలో ప్రజలు ప్రాణభయంతో ఎత్తయిన ప్రదేశాలకు పరుగులు పెట్టడంతో దూరం దూరంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. కాగా, రెండేళ్ల క్రితం 7.5 తీవ్రతతో ఇండోనేషియాలో భూకంపం రావడంతో అది సునామీగా మారి 4 వేల మంది ప్రాణాలను బలితీసుకున్న సంగతి తెలిసిందే. 26 కోట్ల జనాభా ఉన్న ఇండోనేషియో ఒక భారీ ఆర్చిపెలగో ద్వీపం. అయితే, ఇది పసిఫిక్‌ బేసిన్‌లోని అగ్నిపర్వతాల వలయంలో ఉంది. దాంతో అక్కడ భూకంపాలు, అగ్ని పర్వతాలు బద్దలవడం తరచుగా సంభవిస్తుంటాయి. ఇక ఇండోనేషియా వ్యాప్తంగా 1155 కరోనా కేసులు నమోదు కాగా... 102 మంది ప్రాణాలు విడిచారు.
(చదవండి: ఇటలీలో ఆగని విలయం)

మరిన్ని వార్తలు