జెడ్డాలో తెలుగు ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం

5 Sep, 2014 14:13 IST|Sakshi

సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అక్కడ తెలుగు కార్మికులు ఉండే కంటెయినర్లు మొత్తం తగలబడిపోయాయి. ప్రధానంగా తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతంలోనే ఈ ప్రమాదం జరిగింది. అయితే.. ఆ సమయానికి ఎక్కువ మంది విధులకు వెళ్లడంతో భారీ ప్రాణాపాయం తప్పింది. ఉదయం 6.30-7 గంటల ప్రాంతంలోనే ప్రమాదం సంభవించింది. ఆ సమయానికి చాలామంది వెళ్లిపోయినా, కొంతమంది మాత్రం ఇంకా విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్లలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇర్ఫాన్ అనే కార్మికుడు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాదం వల్ల దాదాపు పది లక్షల రూపాయల ఆస్తినష్టం సంభవించింది.

ఈ ప్రమాదం గురించి అశోక్ అనే బాధితుడు 'సాక్షి'తో జెడ్డా నుంచి ఫోన్లో మాట్లాడారు. ఆయన చెప్పిన విషయాలివీ.. 'మూడు నాలుగు కంటెయినర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అవి ఇక ఏమాత్రం పనికిరావు. ఉదయం 6.30-7 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. కొంతమంది మాత్రం నిద్రిస్తున్నారు. చాలామంది ఉద్యోగాలకు వెళ్లారు. అక్కడ సుమారు 200-250 మంది తెలుగువాళ్లు ఉన్నారు. ప్రాణనష్టం లేకపోయినా, గదులలో ఉన్న డబ్బులు, బియ్యం, వస్తువులు అన్నీ పూర్తిగా దగ్ధం అయిపోయాయి. అసలే కంపెనీ నుంచి జీతాలు కూడా సరిగా రాని ఈ సమయంలో ఇలాంటి ప్రమాదం జరగడంతో సర్వస్వం కోల్పోయాం'.

మరిన్ని వార్తలు