270 కోట్ల తప్పుడు ప్రకటనలు తొలగించాం: గూగుల్‌

5 May, 2020 14:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: 2019లో మొత్తం 270 కోట్ల (2.7 బిలియన్లు) తప్పుడు ప్రకటనలను నిషేధించామని సెర్చి ఇంజీన్ దిగ్గజం గూగుల్ వెల్లడించింది. తమ నిబంధనలు ఉల్లంఘించిన తప్పుడు ప్రకటనలను (నిమిషానికి 5,000 పై చిలుకు) తొలగించడం లేదా బ్లాక్‌ చేసినట్లు టెక్‌ దిగ్గజం గూగుల్‌ వెల్లడించింది. అలాగే దాదాపు 10 లక్షల ప్రకటనకర్తల అకౌంట్లను సస్పెండ్‌ చేసినట్లు పేర్కొంది. గూగుల్ 1.2 మిలియన్లకు పైగా ఖాతాలను రద్దు చేసింది. తమ నెట్‌వర్క్‌లో భాగమైన 21 మిలియన్ వెబ్ పేజీల నుండి ప్రకటనలను తొలగించినట్టు వెల్లడించింది. ఇటీవల వెల్లడించిన 'గూగుల్: బాడ్ యాడ్స్ రిపోర్ట్' లో ఈ వివరాలను గూగుల్ పొందుపర్చింది.

యూజర్లను తప్పుదోవ పట్టించే ప్రకటనల వలలో పడకుండా చూసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు గూగుల్‌ పేర్కొంది. కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తితో ఫేస్‌ మాస్క్‌లు, నివారణ మందులు వంటి వాటికి డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో వీటికి సంబంధించే ఎక్కువగా మోసపూరిత ప్రకటనలు ఉన్నాయని గుర్తించినట్లు గూగుల్‌ తెలిపింది. అలాగే అంతకుముందు సంవత్సరంతో పోల్చితే 2019 లో 35 మిలియన్లకు పైగా ఫిషింగ్ ప్రకటనలను తొలగించాం. 19 మిలియన్ల  ట్రిక్-టు-క్లిక్  ప్రకటనలు తొలగించాం. ఈ బెడద సుమారు 50 శాతం తగ్గిందని పేర్కొంది.

కరోనా వైరస్‌ సంక్షోభం మొదలైనప్పటినుంచి ఈ వైరస్ కు సంబంధించి తప్పుడు ప్రచారం, ప్రకటనలతో లబ్ధి పొందేందుకు ప్రయత్నించే ప్రకటనలు, ప్రకటనకర్తలపై ఓ కన్నేసి ఉంచినట్లు వివరించింది. ఇందుకోసం ప్రత్యేకంగా కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ ఇరవై నాలుగ్గంటలూ పనిచేస్తోందని గూగుల్‌ పేర్కొంది. నిబంధనలను పదే పదే ఉల్లంఘించే ప్రకటనకర్తల ఖాతాలను పూర్తిగా తొలగిస్తున్నామని గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌‌ స్కాట్‌ స్పెన్సర్‌ ఒక బ్లాగ్‌పోస్ట్‌లో తెలిపారు. ‘కావాల్సిన సమాచారాన్ని పొందేందుకు గూగుల్‌ను ప్రజలు విశ్వసిస్తారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మేం అత్యంత ప్రాధాన్యం ఇస్తాం. కరోనా సమయంలో కూడా దాన్ని కొనసాగిస్తున్నామని ఆయన వివరించారు. 

మరిన్ని వార్తలు