జకార్తా జలవిలయం!

17 Aug, 2019 03:33 IST|Sakshi
2050కల్లా జకార్తాను సముద్రజలాలు ఆక్రమించే క్రమమిదీ

2050 నాటికి నగరంలో మూడో వంతు సముద్రగర్భంలోకి

బోర్నియో దీవికి రాజధానిని తరలించాలని నిర్ణయించిన ఇండోనేసియా ప్రభుత్వం

జకార్తా: ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో శుక్రవారం కీలక ప్రకటన చేశారు. పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తూ..‘దేశ రాజధానిని జకార్తా నుంచి బోర్నియో దీవిలోని కలిమంతన్‌కు తరలించేందుకు పార్లమెంటు అనుమతి కోరుతున్నాను. రాజధాని అంటే కేవలం ఓ జాతికున్న గుర్తింపు మాత్రమే కాదు. అది దేశం సాధించిన ప్రగతికి చిహ్నం కూడా’ అని విడోడో తెలిపారు. ఏకంగా అధ్యక్షుడే ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి చాలా ముఖ్యమైన కారణముంది. పర్యావరణ మార్పులు, భూతాపం కారణంగా జకార్తా సముద్రంలో శరవేగంగా మునిగిపోతోంది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం పలుచర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రస్తుతమున్న పరిస్థితులే కొనసాగితే, 2050 నాటికి నగరంలోని మూడో వంతు ప్రాంతం సముద్రగర్భంలోకి జారిపోతుందని పర్యావరణవేత్తలు హెచ్చరించిన నేపథ్యంలో రాజధానిని తరలించాలని ఇండోనేసియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పాలకుల వైఫల్యమే శాపం..
కోటి మందికిపైగా ప్రజలు నివసిస్తున్న జకార్తా భూకంపాలు అధికంగా సంభవించే జోన్‌లో ఉంది. చిత్తడినేలపై నిర్మితమైన ఈ నగరానికి సమీపంలో 13 నదులు కలుస్తున్నాయి. పాలకులు జకార్తా నిర్మాణం సమయంలో తాగునీటి సరఫరాపై దృష్టి సారించకపోవడం ఈ నగరం పాలిట శాపంగా మారింది. నీటి సరఫరా జరగకపోవడంతో పరిశ్రమలు, ప్రజలు తమ అవసరాల కోసం బోర్లు వేసి భూగర్భ జలాన్ని విచ్చలవిడిగా తోడేశారు. స్థానిక జలాశయాల్లోని నీటిని కోలుకోలేని రీతిలో వాడేశారు. దీంతో చాలాచోట్ల భూగర్భ జలాలు ఇంకిపోయాయి. దీనికితోడు రాజధాని కావడంతో పెద్దఎత్తున ఆకాశ హర్మ్యాల నిర్మాణం జరిగింది. ఈ చర్యల కారణంగా జకార్తాలో భూమి క్రమంగా కుంగడం ప్రారంభమైంది. ప్రస్తుతం జకార్తాలో ఏటా 25 సెం.మీ. మేర భూమి కుంగిపోతోంది. కొన్నిచోట్లయితే నేల సముద్రమట్టానికి 4 మీటర్ల దిగువకు చేరుకుంది. భూతాపం కారణంగా సముద్రమట్టం పెరుగుతోంది.

ఫలించని ప్రయత్నాలు..
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జకార్తాను కాపాడుకునేందుకు ఇండోనేసియా ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతోంది. జవా సముద్రం ఆటుపోట్లను అడ్డుకునేలా ఓ పొడవైన గోడతో పాటు కృత్రిమ దీవులను నిర్మించాలని అధ్యక్షుడు జోకో విడోడో ప్రతిపాదించారు. ఇందుకు రూ.2.84 లక్షల కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. ఇందులోభాగంగా ఇప్పటివరకూ 32 కిలోమీటర్ల మేర భారీ సముద్రపు గోడను, 17 కృత్రిమ దీవులను నిర్మించారు. అయితే ఇది సమస్యకు అనుకున్న పరిష్కారం చూపలేకపోయింది. ఈ భారీ సముద్రపు గోడ నుంచి చాలాచోట్ల నీరు ఊరటం ప్రారంభమైంది. మరికొన్ని  చోట్ల ఈ గోడే నేలలోకి కుంగిపోవడం ప్రారంభించింది. దీంతో రాజధానిని తరలించడం తప్ప మరో ప్రత్యామ్నాయం ప్రస్తుతానికి లేదని ప్రభుత్వం ఓ అభిప్రాయానికి వచ్చేసింది. అయితే జకార్తాలోని మూడోవంతు ప్రాంతం మునిగిపోతే లక్షలాది మంది ఇండోనేసియా ప్రజలు నిరాశ్రయులయ్యే ప్రమాదముంది. వీరందరికీ ఆశ్రయం కల్పించడం ఇండోనేసియా ప్రభుత్వానికి నిజంగానే సవాలుగా మారనుంది. 

మరిన్ని వార్తలు