కాళ్లుచేతులకు చెట్టు వేర్లు, బెరడ్లు మొలిస్తే..!

1 Feb, 2016 17:42 IST|Sakshi
కాళ్లుచేతులకు చెట్టు వేర్లు, బెరడ్లు మొలిస్తే..!

ఢాకా: సాధారణంగా మనకు ఒంటిపై చిన్న కురుపులాంటిది వస్తేనే పొద్దస్తమానం అది ఎలా పోతుందా అని అద్దం ముందుపెట్టుకొని చూసుకుంటూ కూర్చుంటాం. దాన్ని నయం చేసుకునేందుకు నానా మార్గాలు అనుసరిస్తుంటాం.. చివరికి అది మానిపోయి ఓ మచ్చ ఉన్నా తెగ ఫీలయిపోతుంటాం. అలాంటిది, ఓ చెట్టు బెరడు, వేళ్లు ఆకారంలో పెద్దపెద్ద ఆకృతలతో చేతులకు పొడుచుకొని వస్తే.. అవికూడా పొగాకుచుట్టకాడల గుత్తుల్లా ఏళ్లతరబడి అలాగే ఉండిపోతే.. ఊహించుకోవడానికే చాలా ఇబ్బందిగా ఉంది కదా.. బంగ్లాదేశ్లోని అబుల్ బజందర్ అనే 25 ఏళ్ల యువకుడు ప్రస్తుతం ఇదే సమస్యతో బాధపడుతున్నాడు.

ఇతడిని అక్కడ ట్రీ మ్యాన్ (వృక్ష మనిషి) అని కూడా పిలుస్తుంటారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ ఆస్పత్రికి అతడు చికిత్స కోసం వచ్చాడు. ఈ సందర్బంగా చెట్టు బెరడు లాంటి ఆకృతులతో ఉన్న అతడి రెండు చేతులు, కాళ్లు మీడియా చూపించారు. అతడి చేతికి, కాళ్లకు అలా రావడానికి కారణం ఓ చర్మ వ్యాధి అని వైద్యులు తెలిపారు. దానిని 'ఎపిడర్మోడిస్ప్లాషియా వెర్రసిఫార్మిస్' అని అంటారని తెలిపారు. దాదాపు పదేళ్లుగా ఈ వ్యాధితో బాధపడుతున్న ఈ యువకుడికి శస్త్రచికిత్స చేసేందుకు వైద్యులు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమస్య ప్రపంచంలో చాలా అరుదుగా సంభవిస్తుందని చెప్పారు. గతంలో శస్త్ర చికిత్స ద్వారా వాటిని తొలగించినట్లు కూడా వివరించారు.

మరిన్ని వార్తలు