280కి చేరిన భూకంప మృతుల సంఖ్య

27 Oct, 2015 08:38 IST|Sakshi
280కి చేరిన భూకంప మృతుల సంఖ్య

అఫ్ఘానిస్థాన్ కేంద్రంగా 7.5 తీవ్రతతో సంభవించిన పెను భూకంపం దాదాపు 280 మంది ప్రాణాలను బలిగొంది. వారిలో 12 మంది అఫ్ఘాన్ విద్యార్థినులు కూడా ఉన్నారు. స్కూలు భవనం కూలిపోతుండటంతో అంతా ఒక్కసారిగా బయటపడేందుకు ప్రయత్నించినప్పుడు జరిగిన తొక్కిసలాటలో వారు మరణించారు. 8 మంది పిల్లలతో సహా 214 మంది పాకిస్థాన్‌లో మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. ఉత్తర భారతంపై కూడా భూకంపం ప్రభావం తీవ్రంగానే కనిపించింది.

ఈశాన్య అఫ్ఘానిస్థాన్‌లో దేశ రాజధాని కాబూల్‌కు 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. ఇది భూమికి 213.5 కిలోమీటర్ల లోతున ఉందని అమెరికా జియలాజికల్ సర్వే తెలిపింది. 200 అక్టోబర్‌లో కూడా ఇదే ప్రాంతంలో 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా అప్పట్లో దాదాపు 75 వేల మంది మరణించారు. 35 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

జరిగిన దారుణం గురించి తాను అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో మాట్లాడి, సానుభూతి తెలియజేసినట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. ప్రాథమికంగా లభించిన నష్టం అంచనాలను ఆయన వివరించారని, వీలైనంత సాయం చేస్తామని తాను హామీ ఇచ్చానని ఆయన తెలిపారు. అఫ్ఘాన్, పాకిస్థాన్ దేశాలు రెండింటికీ తమ సాయం అందిస్తామన్నారు. అఫ్ఘాన్‌లో సుమారు 63 మంది మరణించారు. పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫక్తుంఖ్వా రాష్ట్రంలోను, ఫతా ప్రాంతంలోను దాదాపు 120 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇతర రాష్ట్రాల్లో మరికొంతమంది మరణించారు.

మరిన్ని వార్తలు