పాక్‌ ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఖురేషీ

13 Aug, 2019 13:15 IST|Sakshi

ఇస్లామాబాద్‌: జమ్మూకశ్మీర్‌ విభజన, ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయాల పట్ల దాయాది దేశం విషం చిమ్ముతున్న సంగతి తెలిసిందే. కశ్మీర్‌ విభజనను సాకుగా చూపి అంతర్జాతీయ సమాజంలో భారత్‌ను దోషిగా నిలపాలని పాక్‌ తెగ ప్రయత్నించింది. అయితే ఈ విషయంలో పాక్‌కు నిరాశే ఎదురయ్యింది. కశ్మీర్‌పై భారత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల అంతర్జాతీయ సమాజం తమకు అండగా నిలిచే అవకాశం లేదని స్వయంగా పాక్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ పరోక్షంగా అంగీకరించారు. అలాగే అక్కడి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పాక్‌ ప్రజలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

కశ్మీర్‌ అంశంలో భారత్‌పై పాక్‌ చేయబోయే ఫిర్యాదు స్వీకరించడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సిద్ధంగా లేదని ఖురేషీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కశ్మీర్ అంశాన్ని ఉపయోగించుకొని భావోద్వేగాల్ని రెచ్చగొట్టడం, అభ్యంతరాలు వ్యక్తం చేయడం చాలా సులభం. కానీ ఈ విషయంలో ముందుకు సాగడం చాలా కష్టం. మనకు పూలమాలతో స్వాగతం పలకడానికి ఐక్యరాజ్యసమితి సిద్ధంగా లేదు. శాశ్వత సభ్య దేశాల్లో ఎవరైనా మనకు అడ్డం పడవచ్చు. ప్రజలు వివేకంతో ఆలోచించాలి’ అని ఖురేషి జనాలను కోరారు. కశ్మీర్‌పై భారత్‌ తీసుకున్న నిర్ణయానికి రష్యా మద్దతుగా నిలిచిన మరుసటి రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు