ఆసీస్‌ చేతిలో చిత్తైన పాక్‌.. అగ్రస్థానానికి టీమిండియా

17 Dec, 2023 17:41 IST|Sakshi

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023-25 తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా మరోసారి అగ్రస్థానానికి చేరింది. తాజాగా ఆసీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఘోరంగా ఓడటంతో ఇప్పటివరకు టాప్‌లో ఉండిన పాక్‌ రెండో స్థానానికి పడిపోయింది. పాక్‌పై భారీ విజయంతో ఆసీస్‌ 2023-25 సైకిల్‌లో బోణీ కొట్టింది. ఈ సైకిల్‌లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన ఆసీస్‌ కేవలం ఒకే మ్యాచ్‌లో గెలిచి, 41.67 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో నిలిచింది.

భారత్‌.. ఈ సైకిల్‌లో ఇప్పటివరకు ఆడిన ఏకైక మ్యాచ్‌లో విజయం సాధించి, 66.67 పాయింట్ల శాతంతో 16 పాయింట్లు కలిగి టాప్‌లో నిలిచింది. ఆసీస్‌ చేతిలో ఓటమితో రెండో స్థానానికి పడిపోయిన  పాక్‌ 2 మ్యాచ్‌ల్లో ఓ విజయంతో 66.67 పాయింట్ల శాతం కలిగి ఉంది. ఈ జాబితాలో భారత్‌, పాక్‌ల తర్వాత న్యూజిలాండ్‌ (50 పాయింట్ల శాతం), బంగ్లాదేశ్‌ (50), ఆస్ట్రేలియా (41.67), వెస్టిండీస్‌ (16.67), ఇంగ్లండ్‌ (15) వరుసగా మూడు నుంచి ఏడు స్థానాల్లో నిలిచాయి. 

ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా పెర్త్‌ వేదికగా పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ 360 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 233/5 చేయగా.. పాక్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 271, 89 పరుగులు చేసి చిత్తుగా ఓడింది. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో డేవిడ్‌ వార్నర్‌ 164, మిచెల్‌ మార్ష్‌ 90 పరుగులతో చెలరేగగా.. పాక్‌ అరంగేట్రం బౌలర్‌ ఆమిర్‌ జమాల్‌ 6 వికెట్లతో సత్తా చాటాడు. పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (62) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఆసీస్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్‌ ఖ్వాజా (90), మిచెల్‌ మార్ష్‌ (63 నాటౌట్‌) అర్ధసెంచరీలతో రాణించగా.. పాక్‌ బౌలర్లలో ఖుర్రమ్‌ 3 వికెట్లతో పర్వాలేదనిపించాడు. అనంతరం పాక్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో సౌద్‌ షకీల్‌ (24), బాబర్‌ ఆజమ్‌ (14), ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. స్టార్క్‌, హాజిల్‌వుడ్‌ చెరో 3 వికెట్లతో సత్తా చాటారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్‌ మెల్‌బోర్న్‌ వేదికగా డిసెంబర్‌ 26 నుంచి ప్రారంభమవుతుంది. 

>
మరిన్ని వార్తలు