‘పిల్లలు, పెద్దల ఆర్తనాదాలు.. చుట్టూ మంటలు’

23 May, 2020 13:23 IST|Sakshi

‘‘నా చుట్టూ అంతా మంటలు, విపరీతమైన పొగ. విమానం నలుదిక్కుల నుంచి ఏడుపులు. మంటల్లో చిక్కుకున్న పిల్లలు, పెద్దల ఆర్తనాదాలు. అగ్నికీలలే తప్ప మనుషులెవరూ కనిపించలేదు. నొప్పితో విలవిల్లాడుతున్న వారి గొంతులు మాత్రమే వినిపించాయి’’ అంటూ కరాచీ ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఇంజనీర్‌ మహ్మద్‌ జుబేర్‌ తనకు ఎదురైన భయంకరమైన అనుభవాలు పంచుకున్నాడు. చావు అంచుల దాకా వెళ్లిన జుబేర్‌ ప్రస్తుతం కరాచీలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ క్రమంలో పాకిస్తాన్‌‌ మీడియా జియో న్యూస్‌తో మాట్లాడుతూ.. సీటు బెల్టు తొలగించి.. వెలుతురు కనిపిస్తున్న చోటు వైపుగా నడిచి.. 10 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నట్లు తెలిపారు. విమానాన్ని కిందకు దించే క్రమంలో ఏవో ఆటంకాలు ఎదురయ్యాయని.. దాంతో మరోసారి విమానాన్ని ల్యాండ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పైలట్‌ చెప్పాడని.. అంతలోనే నేలకు తగిలి విమానం క్రాష్‌ అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. (భయానకం: ఆకాశం నుంచి మృతదేహాలు?)

కాగా పాకిస్తాన్‌లోని కరాచీలో శుక్రవారం మధ్యాహ్నం జనావాసాల్లో ప్రయాణికుల విమానం కుప్పకూలిన విషయం విదితమే. పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌(పీఐఏ)కు చెందిన ఈ విమానంలో ప్రమాద సమయంలో మొత్తం 99 మంది ఉన్నారు. ఇక బ్యాంక్‌ ఆఫ్‌ పంజాబ్‌ ప్రెసిడెంట్‌ జఫర్‌ మసూద్‌, ఇంజనీర్‌ జుబేర్‌తో పాటు మరో వ్యక్తి మాత్రమే ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి మృత్యుంజయులుగా నిలిచారు. కాగా ల్యాండింగ్‌ గేర్‌లో సమస్య ఏర్పడిందని పైలట్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు సమాచారమిచ్చిన కొన్ని క్షణాల్లోనే ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇక ఇప్పటి వరకు ఘటనాస్థలి నుంచి 82 మృతదేహాలను వెలికితీసినట్లు పాక్‌ స్థానిక మీడియా పేర్కొంది. ఇదిలా ఉండగా.. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపిన ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఈ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.(కుప్పకూలిన పాక్‌ విమానం)

మరిన్ని వార్తలు