కరోనా : రక్తపు గడ్డలపై కీలక పరిశోధన

10 Jul, 2020 16:04 IST|Sakshi

 కరోనా రోగుల్లో బ్లడ్‌ క్లాట్స్‌  : పెథాలజిస్టుల తాజా పరిశోధన

 దాదాపు అన్ని అవయవాల్లోనూ బ్లడ్‌ క్లాట్స్‌

చిన్న రక్త నాళాల్లో కూడా గడ్డలు

కరోనా రోగులు, బ్లడ్‌ క్లాట్స్‌కు సంబంధించి పాథాలజిస్టులు లేబొరేటరీల్లో నిర్వహించిన పరిశోధనలో కీలక  విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనాతో బాధపడిన రోగుల్లో ఏర్పడిన రక్తపు గడ్డలు( బ్లడ్‌ క్లాట్స్‌) సమస్య కేవలం ఊపిరితిత్తుల్లో కాదు దాదాపు అన్ని అవయవాల్లోనూ ఉందని పెథాలజిస్టులు ప్రకటించారు. కరోనాతో మరణించిన వ్యక్తుల శరీరాలపై నిర్వహించిన పరిశోధనల్లో ఈ  విషయాలను గమనించారు.  (కరోనాతో మరో ముప్పు)

ఇప్పటివరకూ వైద్యులు భావిస్తున్నట్టుగా పెద్ద నాళాల్లో మాత్రమే కాకుండా, చిన్నచిన్న నాళాలలో కూడా రక్తపు గడ్డలను గమనించినట్టు ఎన్‌వైయు లాంగోన్ మెడికల్ సెంటర్‌లోని పాథాలజీ విభాగం చైర్మన్ డాక్టర్ అమీ రాప్‌కివిచ్ గురువారం రాత్రి  వెల్లడించారు. కొంతమంది కోవిడ్-19 రోగుల్లో రక్తం గడ్డకట్టే సమస్య చాలా అనూహ్యంగా వుంటుందని కూడా ఆమె అభివర్ణించారు. అలాగే థ్రాంబోసిస్ (రక్తపు గడ్డలు) కేవలం ఊపిరితిత్తులలో మాత్రమే కాదు, దాదాపు ప్రతి అవయవంలోనూ గుర్తించామని ఆమె చెప్పారు. ముఖ్యంగా గుండె, మూత్రపిండాలు, కాలేయం, ఇతర అవయవాల్లో ​ కూడా వీటిని కనుగొన్నామన్నామని  వివరించారు. అలాగే గుండెలో మెగాకార్యోసైట్లు ఉత్పత్తి చేసే ప్లేట్‌లెట్స్ రక్తం గడ్డలకు కారణమని చెప్పారు. మహమ్మారి ప్రారంభ దశలో, మయోకార్డిటిస్‌  ఊపిరితిత్తుల్లో మంటను రేకెత్తిస్తుందని వైద్యులు భావించారు. కానీ శవపరీక్షలలో మయోకార్డిటిస్  ఉనికి చాలా తక్కువగా ఉందని రాప్‌కివిచ్ చెప్పారు. ఈ వ్యాధి మనుషుల శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడానికి నిర్వహించిన శవపరీక్షల్లో తాజా విషయాలను గుర్తించినట్టు ఆమె తెలిపారు. అలాగే చిన్న చిన్న నాళాలలో కూడా గడ్డలు ఏర్పడటంపై పరిశోధకులు దృష్టి సారించాలని ఆమె సూచించారు. రాప్‌కివిచ్ పరిశోధనను  జూన్ చివరిలో ది లాన్సెట్ జర్నల్ ప్రచురించింది.

కాగా  కరోనా రోగుల్లో కనిపిస్తున్న రక్తపు గడ్డలే చాలామంది చనిపోవడానికి కారణమవుతున్నాయని ఇప్పటికే పరిశోధకులు తేల్చారు. మార్చి నెలలో ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందిన దశలో వైద్యులు తాము ఊహించిన దానికంటే అధికంగా ఇలాంటి బ్లడ్ క్లాట్స్‌ను ఎక్కువమంది రోగుల్లో చూసినట్టు గత పరిశోధనల్లో వెల్లడైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు