ఆ వీడియో ట్విటర్ లో పెట్టిన వారికోసం..

30 May, 2016 10:47 IST|Sakshi
ఆందోళన చేస్తున్న మహిళలు

రియో డి జనిరో: ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన బ్రెజిల్ గ్యాంగ్ రేప్ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియో ట్విటర్ లో పెట్టిన ఇద్దరిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తనపై జరిగిన దారుణంగా గురించి బాధితురాలు పోలీసులకు వెల్లడించింది.

గత వారాంతంలో అర్థరాత్రి ఒంటిగంట ప్రాంతంలో తన బాయ్ ఫ్రెండ్ ఇంటికి ఆమె వెళ్లింది. తామిద్దరమే ఇంట్లో ఉన్నామని ఆమె భావించింది. కానీ తర్వాతి రోజు మెలకువ వచ్చేప్పటికి వేరే ఇంట్లో ఉన్నానని, తన చుట్టూ 30 మంది ఉన్నారని.. వీరిలో చాలా మంది చేతుల్లో ఆయుధాలు ఉన్నాయని చెప్పింది. వీరందరూ లేదా వీరిలో కొంతమంది ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గాయాలతో నగ్నంగా, చేతిలో పైసా లేకుండా ఇల్లు చేరుకున్నానని బాధితురాలు కన్నీళ్ల పర్యంతమైంది.

ఆమె ప్రియుడు, మరో వ్యక్తిపై పోలీసులు రేప్ కేసు పెట్టి వారెంట్ జారీ చేశారు. తనపై అత్యాచారానికి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టాలని బాధితురాలు పేర్కొంది. సోషల్ మీడియాలో తనపై అభ్యంతకర వ్యాఖ్యలు చేయడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 'తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడుతున్నారు. కురుచ దుస్తులు వేసుకున్నందుకే ఇలా జరిగిందని అంటున్నారు. ఇది మహిళల తప్పు కాదు. చోరీ జరిగినప్పుడు దొంగలను తప్పుబట్టడం మానేసి బాధితులను నిందిస్తారా?' అని బాధితురాలు ఆక్రోశించింది.

16 ఏళ్ల బాలికపై 33 మంది సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన సో జువో నగరంలో ఈనెల 21న జరిగింది. ఈ వీడియోను సామాజిక మాధ్యమంలో చూసి బ్రెజిల్ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. మరో రెండు నెలల్లో రియో ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన సంచలనం రేపింది.

మరిన్ని వార్తలు