ఈ మీటర్‌తో కరోనాను ఇట్టే గుర్తించవచ్చు!

7 Apr, 2020 14:27 IST|Sakshi

లండన్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ సోకిందా లేదా తెలసుకోవడానికి నిర్ధారణ పరీక్షలకు ఒక్కొక్కరికి నాలుగున్నర నుంచి ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ పరీక్షలను నిర్వహించే సౌకర్యం కూడా అన్ని ల్యాబుల్లో అందుబాటులో లేదు. అందుకని భారత ప్రభుత్వం కూడా విదేశాల నుంచి వచ్చిన వారికి, కరోనా నిర్ధారణ అయిన బాధితుల బంధువులు, సన్నిహితులకే ప్రథమ ప్రాథమ్యం ఇచ్చి ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. కరోనా లక్షణాలు ఉన్నాయంటూ ముందుకు వచ్చిన ఇతర ప్రజలకు ద్వితీయ ప్రాథామ్యం కింద రోజుకు కొంత మందికి చొప్పున పరీక్షలు నిర్వహిస్తోంది.

ప్రాథమికంగా కరోనా వైరస్‌ సోకినట్లు గుర్తించాలంటే జలుబు, పొడిదగ్గుతోపాటు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఆయాసం, జ్వరం రావడం లక్షణాలుగా వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ లక్షణాలు ఒక్క కరోనా రోగుల్లోనే కాకుండా ఎంఫిసెమా, బ్రాంకైటీస్‌తో బాధ పడుతున్న వారికి కూడా ఉంటాయి. ఇలాంటి గందరగోళం లేకుండా కరోనా సోకినట్లు ప్రాథమికంగా గుర్తించేందుకు చాలా సులువైన పద్ధతిని బ్రిటన్‌లోని ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ అండ్‌ కేర్‌ ఎక్స్‌లెన్స్‌’ మాజీ సలహాదారు, ఈస్ట్‌ యార్క్‌షైర్‌కు చెందిన జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ నిక్‌ సమ్మర్టన్‌ కనుగొన్నారు.

శరీరంలోని రక్తంలో ఆక్సిజన్‌ శాతం ఎంత ఉందో కనుక్కోవడం ద్వారా కరోనా ఉందా లేదా అన్న విషయాన్ని ప్రాథమికంగా గుర్తించవచ్చని ఆయన తేల్చారు. రక్తంలోని ఆక్సిజన్‌ శాతాన్ని ‘పల్స్‌ ఆక్సిమీటర్ల’ ద్వారా సులభంగా కనుక్కోవచ్చు. సులభంగా 1800 నుంచి 1500 రూపాయల వరకు ఈ మీటర్లు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. ఆరేసిన బట్టలు ఎగరిపోకుండా పెట్టే క్లిప్పుల తరహాలో దాదాపు అదే సైజులో ఈ ఆక్సిమీటర్లు ఉంటాయి. రక్తంలోని ఆక్సిజన్‌ను ఈ మీటర్లు పల్స్‌ శబ్దం ద్వారా గుర్తిస్తాయి. సాధారణంగా ఆరోగ్య వంతుల్లో ఆక్సిజన్‌ పల్స్‌రేట్‌ 95 శాతం ఉంటుంది. ఎలాంటి జబ్బులు లేనప్పటికీ కొందరిలో సహజంగానే ఇంతకన్నా ఆక్సిజన్‌ పల్స్‌ రేట్‌ తక్కువగా ఉండవచ్చు. (నాడు ఫ్లూ, నేడు కరోనాను జయించిన వృద్ధురాలు)

ఆక్సిజన్‌ పల్స్‌ రేట్‌ను ప్రతి రెండు, మూడు గంటలకోసారి పరీక్షించాలని, అలా రెండు, మూడు సార్లు పరీక్షించినప్పుడు పల్స్‌ రేట్‌ రెండు, మూడు శాతం  పడి పోయినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రతించాలని డాక్టర్‌ సమ్మర్టన్‌ సూచించారు. దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం లాంటి లక్షణాలు రాకముందే ఆక్సిజన్‌ పల్స్‌ రేట్‌ పడి పోవడం ద్వారా కరోనా చాలా ముందుగానే గుర్తించవచ్చని ఆయన చెప్పారు. చాలా మందిలో కరోనా లక్షణాలు కనిపించకముందే పల్స్‌ రేట్‌ పడిపోవడాన్ని తాను గమనించానని, అయితే కొందరిలో పల్స్‌ రేట్‌ పడిపోక ముందు కూడా పెదవులు నీలి రంగుకు మారిపోవడం, మగతగా ఉండడం లేదా ఊపిరి ఆడక పోవడం లాంటి ఇతర కరోణా లక్షణాలు కనిపించవచ్చని, అప్పుడు కూడా వెంటనే వైద్యుడిని సంప్రతించాల్సి ఉంటుందని డాక్టర్‌ సమ్మర్టన్‌ వివరించారు. ఏది ఏమైన ఈ వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి సోకడానికి ముందే సాధ్యమైనంత త్వరగా ప్రాథమికంగా కరోనా గుర్తించడమే లక్ష్యం కావాలన్నారు. రోగుల్లో గుండె, ఊపరితిత్తుల పని తీరును తెలుసుకోవడానికి భారత్‌లో కూడా ప్రతి జనరల్‌ ఫిజిషియన్‌ ఈ ‘పల్స్‌ ఆక్సిమీటర్లు’ ఉపయోగిస్తున్నారు. వైద్యుడి సహాయం లేకుండానే వీటిని ఎవరైనా ఉపయోగించవచ్చు. (చదవండి: గ్లౌస్‌ ధరించినా వైరస్‌ వ్యాపిస్తుంది!)

మరిన్ని వార్తలు