కరోనా: అగ్రరాజ్యంలో ఒక్కరోజే 2108 మంది మృతి

11 Apr, 2020 10:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాపై కరోనా వైరస్‌(కోవిడ్‌-19) విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి ధాటికి గడిచిన 24 గంటల్లో అక్కడ 2 వేల మందికి పైగా మృత్యువాత పడటం ఆందోళనకరంగా పరిణమించింది. శుక్రవారం అమెరికాలో 2108 కరోనా మరణాలు సంభవించాయని జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ తెలిపింది. తద్వారా ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇలా ఒక్కరోజే అత్యధిక కరోనా మరణాలు నమోదు చేసిన తొలి దేశంగా అగ్రరాజ్యం నిలిచినట్లు వెల్లడించింది. కాగా ప్రపంచవ్యా‍ప్తంగా ప్రాణాంతక కోవిడ్‌ బారిన పడి మరణించిన వారి సంఖ్య శుక్రవారం నాటికి లక్ష దాటగా.. 16లక్షల 75వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.(ఉగ్ర ప్రమాదం పొంచి ఉంది: యూఎన్‌ చీఫ్‌ హెచ్చరికలు)

ఇక ఇటలీ, స్పెయిన్‌ తర్వాత అమెరికాలో మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. అమెరికాలో ఇప్పటి దాకా దాదాపు 18,586 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో మరణాల సంఖ్యలో ఇటలీ(18,849) తర్వాతి స్థానంలో అమెరికా నిలిచింది. దాదాపు 5 లక్షల మంది అమెరికన్లు కరోనా బారిన పడ్డారు. ఇక న్యూయార్క్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మృతదేహాలను పూడ్చడానికి సరిపడా చోటు లేకపోవడంతో సామూహిక ఖననం చేస్తున్నారు. కరోనాతో మరణించిన వారి మృతదేహాలను తెలుపు రంగు బాక్సుల్లో ఉంచి, ఒకేసారి ఒకదానిపైన ఒకటి పేర్చి పూడ్చిపెట్టారు. ఇదిలా ఉండగా... అమెరికా తమ పౌరులను స్వదేశానికి రాకుండా అడ్డుకుంటున్న దేశాలపై వీసా నిబంధనలు కఠినతరం చేస్తామని ట్రంప్‌ సర్కారు హెచ్చరించింది. తమ పౌరుల అభ్యర్థనను తిరస్కరించిన దేశాలపై వీసా ఆంక్షలు విధించింది.(6.2 టన్నులు.. భారత్‌కు ధన్యవాదాలు: మాల్దీవులు)

‘అమెరికా పౌరులను అడ్డుకుంటే చర్యలు తప్పవు’

మరిన్ని వార్తలు