జింబాబ్వేలో సైనిక పాలన!

16 Nov, 2017 02:15 IST|Sakshi

అధ్యక్షుడిని ఇంట్లో నిర్బంధించిన సైన్యం

తిరుగుబాటు కాదు.. త్వరలోనే సాధారణ పరిస్థితులు: ఆర్మీ జనరల్‌

భారతీయులంతా క్షేమం: రాయబార కార్యాలయం

హరారే: జింబాబ్వేలో సంచలనం. సైన్యం ఆ దేశాన్ని తన చేతుల్లోకి తీసుకుని అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబేను ఆయన ఇంట్లోనే నిర్బంధించింది. అయితే ఇది సైనిక తిరుగుబాటు కాదనీ, అధ్యక్షుడు, ఆయన కుటుంబీకులు ఇంట్లో క్షేమంగానే ఉన్నారనీ, ముగాబే చుట్టూ ఉన్న నేరస్తులే తమ లక్ష్యమని ఆర్మీ జనరల్స్‌ బుధవారం వెల్లడించారు. తమ లక్ష్యం పూర్తయిన వెంటనే దేశంలో సాధారణ స్థితులు నెలకొంటాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జింబాబ్వే రాజధాని హరారేలో సైన్యం ప్రభుత్వ కార్యాలయాలకు రక్షణ కల్పిస్తూ గస్తీ కాస్తోంది. నగరంలోని ప్రధాన కూడళ్లలో సైనిక శిబిరాలను ఏర్పాటు చేసింది.

జనజీవనం చాలావరకు సాధారణ స్థితిలోనే ఉంది. జింబాబ్వేలోని భారత సంతతి వారు, భారతీయులంతా క్షేమంగా ఉన్నారని హరారేలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. అటు అమెరికా రాయబార కార్యాలయాన్ని బుధవారం మూసి ఉంచారు. అమెరికా పౌరులు సురక్షిత ప్రదేశాల్లోనే ఉండాలని ఎంబసీ సూచించింది. మరోవైపు ముగాబేతో తాను మాట్లాడాననీ, ఆయన క్షేమంగానే ఉన్నారని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్‌ జుమా వెల్లడించారు. ముగాబేతో, జింబాబ్వేలోని సైన్యాధికారులతో భేటీ అయ్యేందుకు తమ దేశం నుంచి రక్షణ శాఖ మంత్రిని పంపుతున్నట్లు ఆయన చెప్పారు.

1980 నుంచీ ఆయనే...
గతంలో రొడేసియా అనే పేరున్న జింబాబ్వే 1965లో బ్రిటిష్‌ పాలన నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకుంది. నల్లజాతివారి సాయుధపోరాటం తర్వాత శ్వేతజాతి పాలన ముగిసింది. విమోచనపోరాటం నడిపిన రాబర్ట్‌ ముగాబే నాయకత్వాన 1980 ఎన్నికల్లో జింబాబ్వే ఆఫ్రికన్‌ నేషనల్‌ యూనియన్‌(జాను) విజయం సాధించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ముగాబే అధికారంలోనే ఉన్నారు. 93 ఏళ్ల ముగాబే ప్రస్తుతం పదవిలో ఉన్న ప్రపంచదేశాల అధ్యక్షుల్లోకెల్లా వయసులో పెద్దవారు. అలాగే 1980 నుంచి ఇప్పటికీ ఒక దేశాధ్యక్షుడిగా కొనసాగుతున్న వ్యక్తి ప్రపంచంలో ఈయన ఒక్కరే.

అయితే 2008, 2013 ఎన్నికల సమయంలో ముగాబే అక్రమాలు, హత్యలు, రిగ్గింగ్‌ చేసి గెలిచారు. ఇన్నేళ్ల  పాలనలో సైన్యం ఆయనకు ఎదురుతిరగడం మాత్రం ఇదే తొలిసారి. మాజీ యుద్ధ సైనికుల సంఘం కూడా తాము ఆర్మీ పక్షానే ఉన్నామని స్పష్టం చేసింది. ముగాబేను, ఆయన పార్టీని అధికారం నుంచి దింపివేయాలని డిమాండ్‌ చేసింది. ప్రాణాలు తీయకుండానే అధికార దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సైన్యం చేపట్టిన చర్యలను ఈ సంఘం ప్రశంసించింది.

భార్య వల్లనే...!
జింబాబ్వే పాలనను సైన్యం చేతుల్లోకి తీసుకోవడంతో దాదాపు నాలుగు దశాబ్దాల ముగాబే నియంతృత్వ పాలనకు తెరపడే అవకాశం ఉంది. ముగాబే ఇటీవల తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ దేశ పాలనపై పట్టు కోల్పోతున్నారనేది కొందరి వాదన. 52 ఏళ్ల తన భార్య గ్రేస్‌ను అధ్యక్షురాలిని చేయాలని ముగాబే అనుకుంటున్నట్లు భావిస్తున్నారు. కానీ ఆమెకు జింబాబ్వే ప్రజల్లో సరైన ఆదరణ లేదు. మరోవైపు ఇటీవలే ఆ దేశ ఉపాధ్యక్షుడు ఎమర్సన్‌ నంగాగ్వాను ముగాబే పదవి నుంచి తప్పించారు.

గ్రేస్‌ ప్రేరణతోనే, ఆమెను అధ్యక్షురాలిని చేయడానికే ఎమర్సన్‌ను పక్కనబెట్టారని కొంతమంది అనుమానిస్తున్నారు. ఎమర్సన్‌కు సైనికాధికారులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ముగాబే పార్టీ వారికి, సైనికులకు అక్కడక్కడా గొడవలు కూడా జరుగుతున్నాయి. దేశంలో రాజకీయ పరిస్థితిని చక్కదిద్దేందుకు తాము పాలనను చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉందని ఆర్మీ కమాండర్‌ కొన్‌స్టాన్టినో చివెంగా సోమవారం చెప్పగా, ముగాబే పార్టీ ఆయనపై దేశ ద్రోహం ఆరోపణలు చేసింది.

కొన్ని రోజుల క్రితం దేశం విడిచి వెళ్లిపోయిన ఎమర్సన్‌ బుధవారమే జింబాబ్వేకు తిరిగొచ్చారు. బుధవారమే సైన్యం ముగాబేను గృహ నిర్బంధం చేసి, పాలనను చేతుల్లోకి తీసుకోవడంతో ఈ పరిణామాల్లో నంగాగ్వా హస్తం ఉందని పలువురు గట్టిగా అనుమానిస్తున్నారు. జింబా బ్వే అధికార మీడియాను కూడా సైన్యం తన అధీనంలోకి తీసుకుంది. అయితే నేరాలు చేస్తూ దేశంలో సామాజిక, ఆర్థిక వ్యవస్థలను చెడగొడుతున్న వారికి శిక్ష వేసేందుకు తాము పాలనను చేతుల్లోకి తీసుకున్నామని ఆర్మీ మేజర్‌ జనరల్‌ సిబుసిసో మొయొ చెప్పడం గమనార్హం.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

>
మరిన్ని వార్తలు