చైనాలో భూకంపం

20 Dec, 2023 01:43 IST|Sakshi

 127 మందికిపైగా దుర్మరణం  700 మందికిపైగా గాయాలు

బీజింగ్‌/జిషిషాన్‌: వాయవ్య చైనాను భూకంపం కుదిపేసింది. సోమవారం అర్ధరాత్రి గన్సు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ఈ భూకంపం ధాటికి చాలా ఇళ్లు నేలమట్టమై 127 మందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయారు. పొరుగు రాష్ట్రం క్విన్‌ఘాయీలోనూ ఈ ప్రకంపనలు బీభత్సం సృష్టించాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి 700 మందికి పైగా గాయాలపాలయ్యారు.

శిథిలాల వద్ద యుద్దప్రాతిపదికన గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం గ్రామీణ ప్రాంతాల్లో సంభవించడంతో మట్టి ఇళ్లు ఎక్కువగా కూలాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. భూమి కంపించడంతో జనం ఇళ్లు వదిలి భయంతో బయటకు పరుగులు తీశారు. భూకంపం వార్త తెలిసి అధ్యక్షుడు జిన్‌పింగ్‌ యుద్ధప్రాతిపదికన వేలాదిగా సహాయక బృందాలు తరలివెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులను ఆదేశించారు. ‘‘భూకంపం ధాటికి విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి.

చలికాలం, అందునా మైనస్‌ 15 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత సహాయక చర్యలకు అవరోధంగా మారింది’’ అని బ్లూ స్కై రెస్క్యూ టీమ్‌ చీఫ్‌ కమాండర్‌ వాంగ్‌ యీ చెప్పారు. గన్సు, క్విన్‌ఘాయీ ప్రావిన్సుల్లో సంభవించిన ఈ భూకంపం కేంద్రస్థానం భూఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో ఉందని చైనాయంత్రాంగం ప్రకటించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.2గా నమోదైంది. భూకంపం వచ్చిన క్విన్‌ఘాయీ ప్రావిన్స్‌.. తరచూ భూకంపాలొచ్చే టిబెట్‌ హిమాలయ ప్రాంతాన్ని ఆనుకుని ఉంది. 

>
మరిన్ని వార్తలు