ఒక్కసారి బ్యాటింగ్‌ మొదలుపెడితే..

18 Jul, 2019 03:04 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్‌ బ్యాట్‌ తయారు చేసేందుకు కెనెడాలోని బ్రిటిష్‌ కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. నాణ్యమైన కశ్మీరీ, ఇంగ్లిష్‌ విల్లోను ఎంపిక చేయడమే కాకుండా.. కంప్యూటర్‌ మోడలింగ్, సమర్థత పెంచేందుకు పనికొచ్చే అల్గారిథమ్‌లను ఇందులో వాడటం విశేషం. ‘అల్గోబ్యాట్‌’అని పిలుస్తున్న ఈ కొత్తరకం బ్యాట్‌ ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న అత్యుత్తమ బ్యాట్‌కు ఏమాత్రం తీసిపోదని.. అందరికీ అందుబాటులోనే ధర ఉంటుందని ఫిల్‌ ఎవన్స్‌ అనే శాస్త్రవేత్త అంటున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రొఫెషనల్‌ క్రికెట్‌ ఆడేవారు దాదాపు 10 లక్షల మంది ఉన్నారు. విరాట్‌ క్లోహ్లీ, స్టీవ్‌ స్మిత్, ఇయాన్‌మోర్గన్‌ వంటి ఆటగాళ్ల స్ఫూర్తిగా క్రికెట్‌లోకి అడుగుపెట్టే పిల్లలకు మంచి బ్యాట్‌ కొనడం ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి బ్యాట్‌ ఖరీదు లక్షల్లో ఉండగా.. తమ ఆల్గోబ్యాట్‌ ఖరీదు రెండు మూడు వేల కంటే ఎక్కువ ఉండదని ఎవన్స్‌ తెలిపారు. బ్యాట్‌ జ్యామితిని మార్చడం ద్వారా బంతి తగిలినప్పుడు అతితక్కువ కంపించడం, తక్కువ శక్తితోనే ఎక్కువ దూరం వెళ్లడం ఈ ఆల్గోబ్యాట్‌ ప్రత్యేకతలని వివరించారు.

ఆల్గోబ్యాట్‌ డిజైన్‌తో సాధారణ కలపతోనూ అత్యుత్తమమైన బ్యాట్‌లు తయారు చేయొచ్చని, ఆయా కలప రకానికి తగ్గట్లు డిజైన్‌ మార్చుకునే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆల్గోబ్యాట్‌ నమూనాలను పరీక్షిస్తున్నామని.. అన్నీ సవ్యంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత మార్కెట్‌లోకి ప్రవేశపెడతామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు