పామును అక్కడ వదిలేసి పోయాడు..!

21 Aug, 2019 15:07 IST|Sakshi

న్యూజెర్సీ: ప్రయాణం చేస్తున్న సమయంలో కొందరు తమ వస్తువులు మరిచిపోవడం చూశాం కానీ ఓ వ్యక్తి ఏకంగా తను పెంచుకునే పామును మరిచిపోయాడు. దీన్ని గుర్తించిన ప్రయాణికులు కేకలు వేయడంతో విమానాశ్రయంలో కాసేపు అలజడి నెలకొంది. ఈ ఘటన న్యూయార్క్‌ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. సోమవారం రాత్రి ఓ ప్రయాణికుడు విమానాశ్రయంలో పామును మరిచిపోయి వెళ్లిపోయాడు. పాపం.. ఆ పాముకు ఎటు వెళ్లాలో దిక్కుతోచక భద్రతా తనిఖీ కేంద్రం వద్ద ఓ మూలన ఉండిపోయింది.

దీన్ని గమనించిన ఓ ప్రయాణికురాలు అక్కడి అధికారులకు విషయం చెప్పింది. ఎయిర్‌పోర్ట్‌లో పాము ఉందని తెలియడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు కాసేపటికి వరకు భద్రతా తనిఖీ కేంద్రాన్ని మూసివేశారు. 15 ఇంచుల పొడవుతో మెడలో పసుపు రంగు హారం ధరించినట్టుగా ఉన్న నల్లటి పామును గుర్తించిన సిబ్బంది అది విషపూరితమైనది కాదని చెప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఆ పామును సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఇక న్యూజెర్సీ ఫెడరల్‌ డైరెక్టర్‌ టామ్‌ కార్టర్‌ మాట్లాడుతూ పాము యజమాని ఎవరో కానీ, దానిపై ఆశలు వదులుకోవాలని చెప్పారు.

మరిన్ని వార్తలు