పొయ్యీ మనదే... పోపూ మనదే!

8 Oct, 2016 08:27 IST|Sakshi

అన్నీ ఉండడం స్వర్గం అయితే, ఒక్కోసారి ఏమీ లేకపోవడం స్వర్గం అవుతుంది! అలాంటి ఒక  ‘ఏమీ లేని’ స్వర్గం స్వీడన్‌లో ఉంది. అక్కడ స్మార్ట్‌ఫోన్‌లు ఉండవు. (ఉన్నా పనిచేయవు). ఇంటర్నెట్ ఉండదు. కరెంటు ఉండదు. ట్యాప్ తిప్పగానే నీరు ధారగా వచ్చేడానికి ఏర్పాట్లు ఉండవు. హాలు ఉండదు. కిచెన్ ఉండదు. బాత్రూమ్ ఉండదు. టాయ్‌లెట్ గదులు ఉండవు. కనీసం ఇల్లు, వాకిలి కూడా ఉండవు. ఇల్లు ఉంటుంది కానీ ఇల్లులా ఉండదు. వాకిలి ఉంటుంది కానీ తాళం, గొళ్లెం ఏమీ ఉండవు. ఇన్ని లేనప్పుడు అది స్వర్గం ఎలా అవుతుంది? అవుతుంది!! టెక్నాలజీ ప్రసాదించిన సౌకర్యాలు, సదుపాయాలతో విసుగెత్తిన ఆధునిక జీవులకు స్వీడన్‌లోని ఆ ‘కోలార్బిన్ ఎకో లాడ్జి’ నిజంగా స్వర్గమే.


                                          స్వీడన్ కోలార్బిన్ ఎకో లాడ్జిలోని 12వ నంబరు ‘గది’ మార్గరీటా
స్కార్స్‌జాన్ బీచ్‌కి దక్షిణం వైపు కిలోమీటరు దూరంలోని ఒక నట్టడవిలో ఈ లాడ్జి ఉంది. లాడ్జి గదులు గదుల్లా ఉండవు. గుడిసెల్లా ఉంటాయి. అవి కూడా ఒక చోట ఉండవు. ఇక్కడొకటి అక్కడొకటి ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా ఉంటాయి. మొత్తం 12 గుడిసెలు. లోపల చెక్క ముక్కలు మండుతూ ఉంటాయి. అది వెలుగు కోసం! రాత్రిపూటైతే ఒక్కో గుడిసె ఒక్కో కొరివి దెయ్యంలా కణకణమంటూ కనిపిస్తుంది. ‘ఆధునిక జీవనంలోని విలాసాల కాలుష్యాల నుంచి కొన్నాళ్లయినా పారిపోవాలనుకునే టూరిస్టులకు ఇదొక ప్యారడైజ్’ అని లాడ్జి ఓనర్ ఆండ్రియాస్ ఆల్సెన్ అంటారు.

 
                                                                లాడ్జి  రిసెప్షన్
ఎకో లాడ్జిలోని ఈ గుడిసెలు మామూలు గుడిసెల కన్నా కూడా చిన్నవిగా ఉంటాయి. లోపల రెండు బెడ్‌లు ఉంటాయి. అటొకటి, ఇటొకటి. వాటిపై గరుగ్గరుగ్గా ఉండే ఉన్ని చర్మం ఉంటుంది. అదే పరుపు! గుడిసెకు ఓ మూల కలప, బొగ్గు ఉంటాయి. వాటిని వెలిగించుకోవాలి. అదొకటే కాదు... బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా మనమే తయారు చేసుకోవాలి. పొయ్యి వెలిగించుకోవాల్సిందీ మనమే, పోపు పెట్టుకోవలసిందీ మనమే. లాడ్జి గదిలో కర్రపుల్లలు లేకపోతే అడవిలోకి వెళ్లి మనమే వంటచెరకు కొట్టుకుని తెచ్చుకోవాలి. ఇవన్నీ తర్వాతి సంగతి. ప్రయాణం చేసి వచ్చిన బడలికతో ఉంటాం కదా! స్నానం చెయ్యాలంటే ఎలా? నో ప్రాబ్లం. పక్కనే చిన్న చిన్న జలపాతాలు ఉన్నాయి. మరి టాయ్‌లెట్? చెట్టు చాటుకు వెళ్లడమే.


                                                       గది లోపల పరుపులు,  ఫైర్‌ప్లేస్
సిగ్గుపడే పనే లేదు. ప్రకృతి తప్ప అక్కడ మనల్ని చూసేవాళ్లెవ్వరూ ఉండరు. మనం కూడా ప్రకృతిలో ఒక భాగమై పోతాము కాబట్టి ప్రకృతి కూడా మనల్ని పట్టించుకోదు. మన దారిన మనం ఆదిమానవుల్లా స్వేచ్ఛగా ఎంజాయ్ చెయ్యడమే. నాలుగు వందల ఏళ్ల క్రితం ఇక్కడ కలప మండించి బొగ్గును తయారుచేసే ‘కోలార్బిన్’ అనే సంప్రదాయం ఉండేదట! బొగ్గు తయారీ కోసం ఇలాంటి గుడిసెల్ని నిర్మించేవారట. ఆ సంప్రదాయాన్ని బతికించినట్లూ ఉంటుంది, బొగ్గుబొగ్గు అయిపోతున్న మోడ్రన్ లైఫ్‌కి కాస్త రిలీఫ్ ఇచ్చినట్లూ ఉంటుందని ఈ ఎకో లాడ్జిని డెవలప్ చేశారట ఆండ్రియాస్ ఆల్సెన్. కాన్సెప్టు బాగుంది కదా! లైఫ్‌లో ఎప్పుడూ ‘పెర్క్’లే కాదు, అప్పుడప్పుడూ ఇలాంటి బ్రేక్‌లూ ఉండాలి.                                         

>
మరిన్ని వార్తలు