ఊరిస్తున్న బ్రిటన్‌ వీసా..

17 Jun, 2018 02:28 IST|Sakshi

వీసా నిబంధనల్ని సులభతరం చేస్తూ పార్లమెంటులో సవరణలు

ఈ నిర్ణయం భారతీయ వృత్తి నిపుణులకు ప్రయోజనకరం: ఫిక్కీ

స్టూడెంట్‌ వీసాల ‘లో రిస్క్‌’ జాబితాలో భారత్‌కు నిరాశ

లండన్‌: విదేశీ వృత్తి నిపుణులకు ప్రయోజనం చేకూర్చేలా.. తన వలస విధానం(ఇమిగ్రేషన్‌ పాలసీ)లో మార్పులు చేసేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఇమిగ్రేషన్‌ పాలసీలో సవరణల్ని ఆమోదం కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. బ్రిటన్‌ వ్యాపార సంస్థలు, కంపెనీలు తమ అవసరం మేరకు విదేశీ వృత్తి నిపుణుల్ని నియమించుకునేందుకు అవకాశం కల్పించేలా వీసా నిబంధనల్ని సరళతరం చేయాలని ఈ సవరణల్లో ప్రతిపాదించారు. బ్రిటన్‌ ప్రభుత్వ నిర్ణయం మన వృత్తి నిపుణులకు మేలు చేకూరుస్తుందని భారత ఐటీ వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది.  


విదేశీ వృత్తి నిపుణుల కోసం బ్రిటన్‌ జారీ చేస్తోన్న టైర్‌ 2 వీసాల ప్రక్రియలో ఇంతవరకూ కఠిన నిబంధనలు కొనసాగాయి. అయితే బ్రెగ్జిట్‌ తర్వాత బ్రిటన్‌ మానవవనరుల కొరతతో ఇబ్బందిపడుతోంది. దాన్ని అధిగమించేందుకు వలస విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. వీసాల పరిమితిని సడలించడంతో పాటు.. ప్రస్తుతం కొనసాగుతున్న కఠిన నిబంధనల్ని సమీక్షించాలని ప్రతిపాదించింది. వేర్వేరు రంగాల్లో ఉద్యోగుల కొరతపై నెలవారీ సమీక్ష నిర్వహించాలని స్వతంత్ర వలసల సలహా కమిటీని కోరతామని పార్లమెంటుకు తెలిపింది. 

బ్రిటన్‌ పార్లమెంట్‌ ప్రకటన ప్రకారం.. ‘ఐరోపాయేతర దేశాల నుంచి బ్రిటన్‌లో పనిచేయడానికి వచ్చే వైద్యులు, నర్సుల్ని టైర్‌–2 వీసాల పరిధి నుంచి మినహాయిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌(ఎన్‌హెచ్‌ఎస్‌) ఆస్పత్రుల్లో వైద్య నిపుణులు, సిబ్బంది కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది’ అని వెల్లడించారు. ప్రస్తుతం నెలకు 1,600 వరకూ టైర్‌ 2 వీసాలు జారీ చేస్తుండగా.. ఆ కేటగిరి నుంచి వైద్యులు, నర్సుల్ని మినహాయించడంతో భారతీయ వైద్యులు, నర్సులు లబ్ధి పొందనున్నారు. ఇతర కీలక వృత్తులను టైర్‌ 2 కేటగిరీ నుంచి మినహాయించవచ్చని భావిస్తున్నారు. సృజనాత్మకత ఉన్న ఫ్యాషన్‌ డిజైనర్లకు టాలెంట్‌ వీసాను జారీ చేయనున్నట్లు సవరణల్లో బ్రిటన్‌ వెల్లడించింది.  

ఆహ్వానించదగ్గ పరిణామం: ఫిక్కీ
బ్రిటన్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని ఫిక్కీ, బ్రిటిష్‌ పరిశ్రమల సమాఖ్య స్వాగతించాయి. ‘భారతీయ నిపుణులు ఎంతో కాలంగా ఈ డిమాండ్‌ను వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టైర్‌ 2 వీసా కేటగిరీని సులభతరం చేయాలన్న బ్రిటిష్‌ ప్రభుత్వ నిర్ణయం ఆహ్వానించదగ్గ పరిణామం. దీంతో వృత్తి నిపుణులు బ్రిటన్‌లో పనిచేసేందుకు మార్గం సులభతరమవుతుంది. దీర్ఘకాలంలో బ్రిటన్‌ వ్యాపార సంస్థల మధ్య పోటీతత్వం పెరుగుతుంది’ అని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ(ఫిక్కీ) అధ్యక్షుడు రశేష్‌ షా అన్నారు.

రెండు దేశాల మధ్య ఉత్సాహపూరితమైన వాణిజ్య, ఆర్థిక సంబంధాల కోసం స్వేచ్ఛాయుత, నిజాయితీ, పారదర్శకతతో కూడిన వీసా నిబంధనల కోసం ఫిక్కీ ప్రయత్నాలు చేసిందని ఆయన చెప్పారు. బ్రిటన్‌ వ్యాపార సంస్థలు ఈ సంస్కరణల్ని ఆహ్వానిస్తాయని, అంతర్జాతీయ నైపుణ్యం, ప్రతిభ బ్రిటన్‌ కంపెనీలకు కీలకమని బ్రిటన్‌ పరిశ్రమ సమాఖ్యకు చెందిన ముఖ్య అధికారి మాథ్యూ ఫెల్‌ పేర్కొన్నారు.

భారతీయ విద్యార్థులకు బ్రిటన్‌ ఝలక్‌
బ్రిటన్‌లో విద్యార్థి వీసాలకు సంబంధించి ‘లో రిస్క్‌’ దేశాల జాబితా నుంచి భారత్‌ను మినహాయించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వలస విధానం సవరణల్లో భాగంగా విదేశీ విద్యార్థులకు ఇచ్చే ‘టైర్‌ 4’ వీసాలకు సంబంధించి 25 దేశాల విద్యార్థులకు నిబంధనల్లో సడలింపు నిచ్చారు. ఈ జాబితాలో ఉన్న అమెరికా, కెనడా, న్యూజిలాండ్‌ తదితర దేశాలకు ఎప్పటినుంచో సడలింపు కొనసాగుతుండగా.. తాజాగా చైనా, బహ్రైన్, సెర్బియా తదితర దేశాల్ని చేర్చారు. జూలై 6 నుంచి ఇది అమల్లోకి రానుంది. జాబితాలోని దేశాలకు చెందిన విద్యార్థులు పెద్దగా తనిఖీలు ఎదుర్కోవాల్సిన అవసరముండదు. అయితే మన దేశం నుంచి వెళ్లే విద్యార్థులు కఠిన తనిఖీలు ఎదుర్కోక తప్పదు. ఇది అవమానకరమని, తప్పుడు సంకేతాలు పంపుతుందని భారత సంతతి వ్యాపారవేత్త లార్డ్‌ కరణ్‌ బిలిమోరియా విమర్శించారు.

మరిన్ని వార్తలు