నౌకలు.. నిధుల జాడలు..

9 Dec, 2015 18:05 IST|Sakshi
నౌకలు.. నిధుల జాడలు..

చరిత్రలో నౌకా ప్రమాదాలు చాలానే జరిగాయి. గమ్యం చేరకుండానే సముద్ర గర్భంలో కలిసిపోయిన పడవలు ఎన్నో. ప్రమాదాలు, వేరే పడవలు ఢీకొనడం, సముద్రపు దొంగల దాడులు.. ఇలా అనేక కారణాలతో పడవలు మునిగిపోతాయి. అలా సముద్రం ఒడి చేరిన చాలా నౌకల్లో కోట్ల విలువ చేసే సంపద కలిగినవి ఎన్నో ఉన్నాయి. సముద్ర గర్భంలో దాగిన సంపదను కనుక్కోవడం ఒకప్పుడుసాధ్యమయ్యేది కాదు. కానీ ఇప్పుడు అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో కొన్ని నౌకల జాడలను కనుగొని వాటిలోని విలువైన నిధుల్ని వెలికి తీస్తున్నారు. అనేక సంస్థలు, దేశాలు సాగిస్తున్న అన్వేషణ ద్వారా మునిగిపోయిన నౌకల నుంచి భారీ సంపద వెలుగులోకొచ్చింది. అలా ఓడల నుంచి వెలికి తీసిన సంపద గురించి తెలుసుకుందాం...
 
ద డైమండ్..

నౌకల ద్వారా లభించిన నిధుల్లో మరో చెప్పుకోదగ్గ సంపద కలిగిన పడవ ద డైమండ్. పోర్చుగీసుకు చెందిన ఈ నౌక 1533లో మునిగిపోయినట్లు అంచనా. ఈ పడవలో వివిధ లోహపు కడ్డీలు, ఫిరంగులు, కత్తులు, 50కి పైగా ఏనుగు దంతాలు, బంగారు నాణేలు వంటి ఇతర సంపద ఉంది. ఇన్ని నిధులతో మునిగిపోయిన ఈ నౌకను కనుగొనేందుకు సముద్రాల్లో పెద్దగా అన్వేషణ ఏమీ జరగలేదు. ఎందుకంటే దీని గురించి బయటివారికి తెలిసింది తక్కువే. మరి ఈ పడవ ఎలా లభించిందీ అనుకుంటున్నారా? 16వ శతాబ్దంలో మునిగిపోయిన ఈ పడవ ఆఫ్రికాలో సముద్రపు ఒడ్డున ఓ బీచ్‌కి ఎప్పుడో కొట్టుకువచ్చింది. అనంతరం ఇసుకలో కూరుకుపోయి అలాగే ఉండిపోయింది. దీన్ని స్థానికులు కూడా సాధారణ పడవే అయి ఉండొచ్చని ఎవరూ పట్టించుకోలేదు. కానీ డీబీర్స్ అనే వజ్రాల సంస్థ తరపున కొందరు నిపుణులు బీచ్‌లోని ఇసుకలో అన్వేషణ సాగిస్తుండగా ఈ నిధి లభ్యమైంది. ఇలా అనుకోకుండా భారీ సంపద కలిగిన నౌక గురించి ప్రపంచానికి తెలిసింది.
 
ది ఆటోకా మదర్‌లోడ్..
అత్యంత భారీ సంపదతో మునిగిపోయిన పడవల్లో ఆటోకా మదర్‌లోడ్ ఒకటి. బంగారం, వెండి, నీలిమందు, రాగి, ఇతర ఆభరణాలతో కలిపి ఈ కార్గోషిప్‌ను నింపారు. ఇది ఎంత పెద్దదంటే ఈ మొత్తం నిధులతో కలిపి కార్గోను నింపేందుకే దాదాపు రెండు నెలల సమయం పట్టింది. 1622లో ఈ పడవ ఫ్లోరిడా తీరాన అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయింది. అప్పటినుంచి సముద్రగర్భంలో కలిసిన ఈ పడవను కనుగొనేందుకు చాలా అన్వేషణలే జరిగాయి. ఈ విషయంలో స్పెయిన్ తీవ్ర ప్రయత్నాలే చేసింది. అయితే సముద్రంలో అన్వేషణ సాగించడం అంత సత్ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. కానీ మెల్ ఫిషర్ అనే ఓ అన్వేషకుడు మాత్రం దాదాపు పదిహేడేళ్లు శ్రమించి ఈ నౌక జాడను కనుగొన్నాడు. అతడి శ్రమ ఫలితంగా 1985 జూలైలో ఈ నౌక వెలుగులోకొచ్చింది. నౌకలో మునిగిపోయినట్లు భావిస్తున్న పూర్తి సంపదమాత్రం ఇంకా దొరకలేదు. కానీ ఈ నౌకలో ఉన్న మొత్తం సంపద విలువ నేటి కాలమానం ప్రకారం మూడు వేల కోట్లకుపైగా ఉంటుంది.  పడవలోని కొద్దిపాటి నిధి మాత్రమే దొరకడంతో ఇంకా దీనిపై అన్వేషణ కొనసాగుతోంది.
 
 ఎస్.ఎస్. రిపబ్లిక్..

అమెరికాకు చెందిన ఈ నౌక 1865లో జార్జియా తీరంలో భారీ తుపాను కారణంగా మునిగిపోయింది. ఈ పడవలో 14,000 వరకు వివిధ కళాఖండాలు, 51,000కు పైగా అమెరికాకు చెందిన వెండి, బంగారు నాణేలు, ఖరీదైన గ్లాసులు, బాటిళ్లు సహా భారీ సంపద ఉండేది. విలువైన నిధులతో ముగినిపోయిన దీన్ని కనుగొనేందుకు ఒడిస్సీ సంస్థ రంగంలోకి దిగింది. చివరకు ఈ నిధిని ఆ సంస్థ కనుగొంది. కానీ ఆ పడవ ఎక్కడుందో కనుగొన్నది తన దగ్గరున్న సమాచారం ఆధారంగానే అని, అందుకే ఆ నిధి తనకే దక్కాలని ఓ వ్యక్తి ఒడిస్సీ సంస్థపై కేసు దాఖలు చేశాడు. కానీ 2004లో ఈ నిధి మొత్తం ఒడిస్సీకే దక్కేలా కోర్టు తీర్పు ఇచ్చింది.
 
ఎస్.ఎస్. గారిసోపా..

దాదాపు రెండు లక్షల కిలోలకు పైగా వెండి కలిగిన ఎస్.ఎస్.గారిసోపా నౌక 1941లో సముద్రంలో మునిగిపోయింది. జర్మన్‌కు చెందిన మరో నౌక జరిపిన దాడిలో గారిసోపా సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఇందులో ఉన్న మొత్తం వెండి విలువ దాదాపు పదమూడు వేలకోట్ల రూపాయల కంటే ఎక్కువే ఉంటుంది. సముద్రాల్లో నిధుల కోసం అన్వేషణ సాగించే ఒడిస్సీ మెరైన్ అనే సంస్థ దీన్ని కనుగొంది. సముద్రంలో లభించిన వాటిలో అతిపెద్ద లోహపు సంపద కలిగిన పడవ ఇదే. అయితే ఈ సంపద ఎవరికి దక్కాలనే విషయంలో ఒడిస్సీ సంస్థకూ, బ్రిటన్‌కు మధ్య కొంతకాలం వివాదం తలెత్తింది. చివరకు ఒప్పందం ప్రకారం ఒడిస్సీ సంస్థ 80 శాతం, బ్రిటన్ 20 శాతం నిధిని పంచుకున్నాయి.
 
 బెలిటంగ్..
భారీ సంపదతో లభించిన తొలి అరేబియన్ ఓడ ఇదే. దీన్ని 1998లో ఇండోనేషియా సముద్ర తీరంలో కనుగొన్నారు. ఈ నౌకలో విలువైన సామగ్రిని అన్వేషకులు గుర్తించారు. ఇందులో వెండి జాడులు, బంగారు కప్పులు, వెండితో తయారైన గిఫ్ట్ బాక్సులు, గిన్నెలు, వివిధ రత్నాలు, కెంపులువంటి అరుదైన ఆభరణలు ఎన్నో లభించాయి. వీటి మొత్తం విలువ దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది. ఈ ఓడను సింగపూర్ ప్రభుత్వం కొనుగోలు చేసింది.

మరిన్ని వార్తలు