ట్రంప్ నిర్ణయంపై సర్వత్రా నిరసనలు

23 Jun, 2020 12:44 IST|Sakshi

వాషింగ్టన్ః కరోనా వైరస్ ప్రభావం వల్ల కలిగిన ఆర్థిక నష్టాన్ని పూడ్చుకునేందుకు ఇమిగ్రేషన్ వీసాలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై సర్వత్రా  నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దిగ్గజ టెక్ కంపెనీలు సహా టెక్ నిపుణులు, రాజకీయవేత్తలు ట్రంప్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘అమెరికా ఆర్థిక ప్రగతికి ఇమిగ్రేషన్ ఇచ్చిన ప్రోద్బలం అమోఘం. అమెరికాతో పాటు గూగుల్ టెక్ లీడర్‌గా ఎదగడానికి అదే కారణం. ఈ సమయంలో ఇమిగ్రెంట్స్కు మా మద్దతు తెలియజేస్తున్నాం. అందరికీ పని చేసే అవకాశం కల్పించేందుకు కృషి చేస్తాం’ అని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్విట్టర్లో పేర్కొన్నారు.(వెనక్కి రావాల్సిందేనా?)

ట్రంప్ కొత్త విధానం అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని ట్విట్టర్ పబ్లిక్ పాలసీ హెడ్ జెస్సికా తెలిపారు. ‘ఇమిగ్రేషన్ అమెరికాకు ఉన్న అతి పెద్ద సంపద. దాన్ని ట్రంప్ తక్కువగా అంచనా వేశారు’ అని వ్యాఖ్యానించారు. శాశ్వత వీసాలపై మరో 60 రోజుల పాటు, తాత్కలిక వీసాలపై ఈ ఏడాది చివరి వరకూ నిషేధం విధిస్తున్నట్లు మంగళవారం వైట్ హోజ్ ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా వల్ల దెబ్బతిన్న అమెరికన్లకు ఉపశమనం కలిగించేందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించింది.

అమెరికా తాత్కాలికంగా నిషేధించిన వాటిలో పాపులర్ వీసాలైన హెచ్1బీ, హెచ్2బీ, హెచ్4, జే, ఎల్ కూడా ఉన్నాయి. ట్రంప్ సంతకం చేసిన కొత్త రూల్స్ రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. వాషింగ్టన్ కు చెందిన ఓ థింక్ ట్యాంక్ లెక్కల ప్రకారం 2.19 లక్షల మంది తాత్కాలిక వర్కర్లు కొత్త పాలసీ వల్ల ఉద్యోగాలు కోల్పోతారు. అమెజాన్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, టెస్లా, ఉబర్, పేపాల్ తదితర కంపెనీలు కూడా హై స్కిల్డ్ వర్కర్లను దేశం నుంచి పంపేయడాన్ని వ్యతిరేకించాయి. దీని వల్ల దేశం నష్టపోతుందని తప్ప ఒరిగే లాభమేమీ ఉండదని అభిప్రాయపడ్డాయి.(వర్క్‌ వీసాల నిలిపివేత)

వర్క్ వీసాల జారీపై తాత్కాలిక నిషేధాన్ని ఎత్తేయాలని భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కోరారు. కరోనా తర్వాతి ఫేజ్ ను ఎదుర్కొనేందుకు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న హై స్కిల్డ్ వర్కర్లు అవసరం ఉందని పేర్కొన్నారు. హెచ్1బీ ప్రొగ్రాం ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగులు దేశ హెల్త్ కేర్ సిస్టంను కాపాడుకుంటూ వస్తున్నారని తెలిపారు. హెచ్ 1బీ తో పాటు ఎల్ 1బీ వీసాల జారీని నిలిపేసే బదులు వాటికి కొన్ని మార్పులు చేయాలని సూచించారు. ట్రంప్ అమెరికా బిజినెస్ ను నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ ఉమన్ డొనా ఈ షలాలా ఆరోపించారు. ఆయన నిర్ణయంతో అమెరికా పేదరికంలోకి జారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ ముసుగులో ట్రంప్ ఇమిగ్రెంట్లపై తన అక్కసును వెళ్లగక్కుతున్నారని మరో కాంగ్రెస్ మహిళ షెల్లీ పింగ్రీ అన్నారు.

మరిన్ని వార్తలు