టెస్లా మోడల్3 తొలి ఎలక్ట్రిక్ కార్లు డెలివరీ

29 Jul, 2017 17:14 IST|Sakshi



లాస్ ఏంజిల్స్: అమెరికన్ లగ్జరీ ఎలెక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా మూడు ఎలక్ట్రిక్‌​ కార్లను  కస్టమర్లకు అందించింది.  కాలిఫోర్నియాలోని ఫ్రెమొంట్‌  వాహన తయారీ కర్మాగారంలో సంస్థ మొట్టమొదటి 30మందిలో  ముగ్గురు కొనుగోలుదారులకు  కార్ల  కీ ని  అందజేసింది. 

మోస్ట్‌ ఎవైటెడ్‌  ఎఫర్డబుల్‌ ఎలక్ట్రిక్ కార్ల ఎంట్రీకి  శుక్రవారం రాత్రి  జరిగిన ఓ కార్యక్రమంలో  ముగింపు  పడిందని టెస్లా సీఈవో ఎల్లోన్‌  మస్క్‌  ప్రకటించారు.  అమెరికా మార్కెట్లో మోడల్‌ 3 ప్రారంభ ధర 35వేల డాలర్లుగా (సుమారు రూ. 22.8 లక్షలు) ఉండనుంది.  కాగా ఇప్పటికే లాంచ్‌ చేసిన మొట్టమొదటి మూడు వాహనాలు - రోడస్టర్‌, మోడల్ ఎస్‌, మోడల్ ఎక్స్‌ కార్లు చాలా ఖరీదు.  దాదాపు  లక్ష డాలర్లకు ( సుమారు రూ. 64 లక్షలు) పై మాటే.  టెస్లా ఇతర ఎలక్ట్రిక్ కార్లతో పోల్చుకుంటే మోడల్ 3 అత్యంత సరసమైన కారుగా  చెప్పొచ్చు.

మొత్తం అల్యూమినియం బాడీకాకుండా కొంత స్టీల్‌తో రూపొందించారు. ఇంకా  సింగిల్‌ చార్జ్‌తో 5 నుంచి 6 సెకన్స్‌ లో 0.60  ఎంపీహెచ్‌ వేగాన్ని అందుకుంటుంది.  అయితే లార్జ్‌ బ్యాటరీ, ఆన్‌ స్క్రీన్‌ డ్యాష్‌ బోర్డు, ఫాన్సీ వీల్స్‌, మెటాలిక్‌ పెయింట్‌, అటానమస్‌ డ్రైవింగ్‌ ఫీచర్స్‌ను కావాలంటే క‍స్టమర్లు జోడించుకోవచ్చు.  అలాగే ఈ కారుకు  నాలుగు సంవత్సరాల, 50,000 మైళ్లవరకు  వారంటీ ఉంది.  100,000 మైళ్ళ  పరిధిలో ఎనిమిది సంవత్సరాల బ్యాటరీ వారంటీ   కూడా ఉంది.

ఇది టెస్లా కు సంబంధించి గొప్ప రోజు..ఎప్పుడూ కేవలం ఖరీదైన కార్లనే తయారు చేయడం తమ లక్ష్యం కాదని , కార్లను ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయాలని తాము కోరుకుంటున్నామని టెస్లా సీఈవో   మీడియాకు చెప్పారు. మోడల్‌ 3 కార్లను ఇపుడు ప్రీ బుకింగ్‌ చేసుకుంటే  2018లో చివరికి నాటికి అందించే అవకాశం ఉందని చెప్పారు. టెస్లా రూపొందించే ప్రతిదీ అందమైనదిగా ఉంటుందని టెస్లా  చీఫ్ డిజైనర్ ఫ్రాంజ్ వాన్ హోల్జాజెన్ అన్నారు. మోడల్‌ 3 మరింత విశాలంగా కనిపించడానికి ప్ర​త్యేకంగా గ్లాస్‌ రూఫ్‌తో తయారు చేసినట్టు చెప్పారు.

ప్రస్తుతం ఈ కారుకు డిమాండ్ విపరీతంగా ఉండడంతో  మోడల్ 3 ప్రొడక్షన్ పెద్ద ఛాలెంజ్‌ అని  టెస్లా పేర్కొంది.  ఈ నేపథ్యంలో  2017 ఆగష్టు నాటికి 100 కార్లను, సెప్టెంబర్ 2017 నాటికి 1500 కార్లను ఉత్పత్తి చేయనుంది.

>
మరిన్ని వార్తలు