పుర్రెల గోడలు, అస్థిపంజరాల హారాలు

30 Oct, 2015 16:15 IST|Sakshi
పుర్రెల గోడలు, అస్థిపంజరాల హారాలు

చెక్ రిపబ్లిక్ : పాత వస్తువులతో  కళాఖండాలు తయారుచేయడం మామూలే. వేస్ట్ మెటీరియల్ తో అద్భుత ఆవిష్కరణలు చేయడం కూడా మనకు తెలిసిందే. కానీ ఎముకలతో షాండ్లియర్స్ రూపుదిద్దుకుంటే.. వేలాది అస్థిపంజరాల హారాలు ద్వారాలకు అలంకారాలుగా వేలాడితే.. పుర్రెల కుప్పలుగా పోసి గోడలు కడితే... మొత్తంగా కట్టడమంతా మానవ అస్థిపంజరాలు, ఎముకలతో నిర్మిస్తే.. అమ్మో! అక్కడికి వెళ్లాలంటే భయంతో బిక్క చచ్చిపోతాం.. కానీ చాలామంది పర్యాటకులు మాత్రం అక్కడికి వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. అక్కడి అద్భుతాలకు ముగ్ధులవుతున్నారు.  ఇంతకీ ఎక్కడ ఉందా వింత కట్టడం అనుకుంటున్నారా.. చెక్ రిపబ్లిక్ రాజధాని పరాగ్వేకు సమీపంలో ఉన్న సెడ్లాక్ లో ఉంది.  దాదాపు 40 వేల అస్థిపంజరాలతో డిజైన్ చేసిన ఈ భవనం ఓ  చర్చి. అందుకే దీన్ని ముద్దుగా బోన్ చర్చి, టెర్రిఫిక్ చర్చి అని పిలుస్తారు.

15వ శతాబ్ధంలో చర్చి నిర్మాణం కోసం తవ్వినపుడు ఈ అస్థిపంజరాలు బయటపడ్డాయి. 1870 వరకు ఆ అస్థిపంజరాలను ఎవరూ ముట్టుకోలేదు. ఆ తర్వాత స్థానిక శిల్పి ఒకరు వీటితో ఓ అద్భుత కళాఖండాన్ని నిర్మించారు.  ఆ కళాకారుడి ఆవిష్కరణలు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తున్నాయి.  పుర్రెల దండలు, వెన్నుపూసలతో చేసిన షాండ్లియర్స్ , క్యాండిల్స్ స్టాండ్, కప్పులు, వృత్తాకారాలు, శిలువలు... ఇలా ఒకటా రెండా ఆ చర్చికి ప్రధాన ఆకర్షణలు చాలానే ఉన్నాయి.

దీనికి సంబంధించి ఒక కథనం ప్రచారంలో ఉంది. 1278వ సంవత్సరంలో సెడ్లాక్‌కు చెందిన ఓ వ్యక్తి జెరుసలాం నుంచి మట్టిని తెచ్చి ఆ ఊళ్లోను,  శ్మశానవాటికలోనూ, చుట్టుపక్కల ఉన్న మత ప్రచారకుల మీద చల్లాడంటారు. దీంతో ఈ ప్రాంతం  పవిత్ర స్థలంగా మారిపోయిందన్న విశ్వాసంతో స్థానికులు అక్కడే శవాలను పాతిపెట్టడం మొదలుపెట్టారు. ఆ సాంప్రదాయం 14వ శతాబ్ధం వరకు కొనసాగింది. అప్పట్లో యూరోప్ అంతా ప్రబలిన ప్లేగు వ్యాధి వల్ల 30వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వారిని ఇక్కడే పూడ్చిపెట్టారు.  మతిభ్రమించిన కొంతమంది మత పెద్దలు ఇలా మానవ అస్థిపంజరాలను ఇలా తయారు చేశారనే మరో కథనం స్థానిక గ్రామాల్లో  ప్రాచుర్యంలో ఉంది.

అలాగే మతయుద్ధాలు చెలరేగిన సెడ్లాక్ ప్రాంతంలో మరో 10వేల మంది చనిపోయారు.  ఇలా  మొత్తం 40వేల మానవ అస్థిపంజరాలతో  స్థానిక కళాకారుడు ఈ పవిత్రమైన చర్చికి రూపకల్పన చేసినట్టుగా సమాచారం.  అన్నట్టు దీనికి  సంబంధించిన వీడియో ఒకటి కూడా ఇంటర్నెట్ లో ఉంది.

మరిన్ని వార్తలు