వ్యక్తి ప్రాణం తీసిన రోబో.. కూరగాయల బాక్స్ అనుకొని కన్వేయర్‌ బెల్ట్‌పై పడేయడంతో..

9 Nov, 2023 17:35 IST|Sakshi

వేగవంతమైన సాంకేతిక  అభివృద్ధి కారణంగా ఎంత మేలు జరుగుతుందో అంతే చెడు కూడా జరుగుతోంది. సాంకేతిక విస్తరణలో భాగంగా ఇటీవల కాలంలో రోబోల వినియోగం బాగా పెరిగింది. మనిషులు చేసే చాలా పనులను రోబోలు చిటికెలో చేసేస్తున్నాయి. అయితే కొన్నిసార్లు సాంకేతికతను మనం మంచి పనుల కోసం ఉపయోగించినా.. కొన్నిసార్లు చెడుగా మారుతుంది. టెక్నాలజీలో లోపాలుంటే అది ఎంతటి ప్రమాదానికి దారి తీస్తుందో చెప్పే ఘటన దక్షిణ కొరియాలో బుధవారం వెలుగుచూసింది. మనిషిని, కూరగాయల డబ్బాను వేరు చేసి గుర్తించడంలో విఫలమైన రోబో వ్యక్తి మరణానికి కారణమైంది.

వివరాలు.. దక్షిణ జియోంగ్‌సాంగ్‌ ప్రావిన్స్‌లోని వ్యవసాయ ఉత్పత్తుల పంపిణీ పరిశ్రమంలో రోబోటిక్‌ మిషిన్‌లను వినియోగిస్తున్నారు. అవి కూరగాయాలతో నింపిన  డబ్బాలను గుర్తించి కన్వేయర్‌ బెల్ట్‌పై ఎక్కిస్తాయి. ఈ క్రమంలో ఓ రోబో దాని పక్కనే ఉన్న ఓ వ్యక్తిని కూరగాయాల డబ్బాగా భావించి.. అతన్ని ఎత్తి కన్వేయర్‌ బెల్ట్‌పై పడేసింది. రోబో వ్యక్తిని గట్టిగా పట్టుకోవడంతో అతని ఛాతీ భాగం, ముఖం ఛిద్రమయ్యాయి. గమనించిన సిబ్బంది వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు.

అయితే బాక్సులను గుర్తించాల్సిన రోబోలో సాంకేతిక లోపం తల్లెత్తడం కారణంగానే అది మనిషిని, కూరగాయలతో ప్యాక్‌ చేసిన పెట్టెతో పోల్చుకోవడంలో విఫలమైందని సదరు కంపెనీ తెలిపింది. ఇదే ప్రమాదానికి దారితీసిందని పేర్కొంది. మూడు రోజుల క్రితం రోబో సెన్సర్‌లో లోపం ఉందని గుర్తించగా.. దాన్ని బాగు చేయడానికి తయారీ కంపెనీకి సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది. దాన్ని తనిఖీ చేస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని.. పైగా మరమ్మతు నిర్వహిస్తున్న వ్యక్తినే అది పొరబడిందని పేర్కొంది. ఇక దక్షిణ కొరియాలో ఇలాంటి ప్రమాదం జరగడం ఈ ఏడాది ఇది రెండోసారి. మార్చిలో ఆటోమొబైల్‌ విడిభాగాల తయారీ కంపెనీలో పనిచేస్తున్న 50 ఏళ్ల వ్యక్తి రోబో చేతిలో నలిగి తీవ్ర గాయాలతో మరణించాడు.
చదవండి: కంపెనీ సీఈవోకు గుండెపోటు.. ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌ వాచ్‌

మరిన్ని వార్తలు