టెక్సాస్‌ యూనివర్సిటీలో కాల్పుల కలకలం

4 Feb, 2020 08:32 IST|Sakshi

టెక్సాస్‌ : టెక్సాస్‌ యూనివర్సిటీలో సోమవారం కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళలు మరణించగా, రెండేళ్ల చిన్నారి గాయపడ్డారు. గాయపడ్డ చిన్నారికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. టెక్సాస్‌ ఏఅండ్‌ఎమ్‌ యూనివర్సిటీ(కామర్స్‌)లోని ప్రైడ్‌ రాక్‌ రెసిడెన్సీ హాల్‌లో ఈ కాల్పులు చోటుచేసుకున్నట్టుగా అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.17 గంటలకు కాల్పులు జరిగనట్టు తమకు సమాచారం అందిందని యూనివర్సిటీ పోలీస్‌ చీఫ్‌ బ్రయాన్ వాఘన్ మీడియాకు వెల్లడించారు. దీంతో తాము ఘటన స్థలానికి వెళ్లి చూడగా.. ఓ గదిలో ఇద్దరు మహిళలు మృతిచెంది కనిపించారని చెప్పారు. గాయపడ్డ చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. అయితే మరణించినవారు యూనివర్సిటీ విద్యార్థుల లేదా బయటి వ్యక్తుల అనేదానిపై వాఘన్‌ స్పష్టత ఇవ్వలేదు. 

ప్రైడ్‌ రాక్‌ రెసిడెన్సీ హాల్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించినట్టు యూనివర్సిటీ అధికారులు ధ్రువీకరించారు. ముందు జాగ్రత్తగా విద్యార్థులు, టీచర్లు బయటకు రావద్దని సూచించారు. అలాగే ఆ రోజుకు మిగతా క్లాసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, ఈ కాల్పులు ఎందుకోసం జరిగాయనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు