అలా అయితేనే పాక్‌ శాంతియుతం : అమెరికా

20 Jul, 2019 09:34 IST|Sakshi

వాషింగ్టన్‌ : ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ విషయంలో పాక్‌ ఏ మేరకు కఠినంగా వ్యవహరిస్తుందో ఇకపై చూడాల్సి ఉందని వైట్‌హౌజ్‌ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ముంబై పేలుళ్లు, భారత పార్లమెంట్‌పై దాడి సూత్రధారి, జమాత్‌ ఉద్దౌలా (జేయూడీ) హఫీజ్‌ సయీద్‌ను పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌కు చెందిన కౌంటర్‌ టెర్రరిజం డిపార్ట్‌మెంట్‌ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో హఫీజ్‌ అరెస్ట్‌ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ నేపథ్యంలో ట్రంప్‌ పరిపాలనా అధికారి మాట్లాడుతూ.. ‘గతంలో ఏం జరిగిందో మనకు తెలుసు. మిలిటరీ గ్రూపులకు పాకిస్తాన్‌ సైన్యం సహాయం చేస్తుందన్న విషయం బహిరంగ రహస్యమే. ఉగ్రవాదాన్ని అంతం చేసే క్రమంలో ఉగ్ర సంస్థల ఆస్తులు సీజ్‌ చేసే దిశగా ముందుకు సాగుతున్నామంటూ ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చెప్పడం హర్షించదగ్గ విషయం. అయితే ఇప్పుడు హషీజ్‌ సయీద్‌ విషయంలో పాక్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే గతంలో అతడు ఏడుసార్లు అరెస్టయ్యాడు. కానీ వెంటనే విడుదలయ్యాడు కూడా. అందుకే అతడి అరెస్టు లష్కర్‌-ఎ-తొయిబా కార్యకలాపాలను ఏ మేరకు ప్రభావితం చేస్తుందనేది మన ముందున్న ప్రశ్న. తూతూ మంత్రంగా కాకుండా పాక్‌ నిజంగా ఉగ్రవాదాన్ని రూపుమాపాలని భావిస్తే ఆ దేశంలో శాంతి, సుస్థిరత నెలకొంటాయి’ అని పేర్కొన్నారు.

కాగా అంతర్జాతీయ ఉగ్రవాది అయిన హఫీజ్‌.. ఉగ్రకార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నాడన్న కేసులో ముందస్తు బెయిల్‌ పొందేందుకు గుజ్రన్‌వాలా ప్రాంతం నుంచి లాహోర్‌కు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఇక హఫీజ్‌పై అమెరికా ఇప్పటికే దాదాపు రూ.68 కోట్ల రివార్డు ప్రకటించింది. హఫీజ్‌ను ఉగ్రకార్యకలాపాల వ్యతిరేక కోర్టు ముందు హాజరుపర్చగా ఏడు రోజుల పాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. ఆ తర్వాత కోట్‌ లక్‌పత్‌ జైలుకు తరలించారు. ఇక జేయూడీకి చెందిన 13 మంది అగ్రనేతలపై పంజాబ్‌ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో జూలై 3న దాదాపు 23 కేసులు నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు