క‌రోనా జంతువుల నుంచే పుట్టింది: డబ్ల్యూహెచ్‌ఓ

21 Apr, 2020 19:14 IST|Sakshi

ప్ర‌పంచానికి చెమ‌ట‌లు ప‌ట్టిస్తోన్న క‌రోనా వైర‌స్ చైనాలోని వూహాన్ వైరాల‌జీ ల్యాబ్‌లో జ‌న్మించిందంటూ అగ్ర‌రాజ్య అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ స‌హా ఇత‌ర నిపుణులు సైతం అనుమానాలు వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే వైర‌స్ త‌మ సృష్టి కాద‌ని, అపన‌వ‌స‌రంగా నింద‌లు వేయ‌డం త‌గ‌ద‌ని వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీ అధికారులు ఆ వార్త‌ల‌ను ఖండిస్తూ వ‌చ్చారు. తాజాగా ఇదే అభిప్రాయాన్ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌(డ‌బ్ల్యూహెచ్‌వో) వ్య‌క్తం చేసింది. వైర‌స్ పుట్టుక‌కు జంతువులే కార‌ణ‌మ‌ని, ల్యాబ్‌లో వైర‌స్ ఉద్భ‌వించిన‌ట్లు ఎలాంటి ఆధారాలు లేవ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు డ‌బ్ల్యూహెచ్‌వో ప్ర‌త్యేక అధికారిణి ఫ‌డేలా చైబ్ మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడుతూ.. వైర‌స్‌కు జంతువులే జ‌న్మ‌స్థానంగా నిలిచాయ‌‌ని, ల్యాబ్‌ల‌లో దీన్ని సృష్టించ‌లేద‌ని పేర్కొన్నారు. అన్నిర‌కాల ఆధారాలు దీన్నే రుజువు చేస్తున్నాయ‌ని తెలిపారు. (అమెరికా విచారణకు చైనా నో!)

అయితే గ‌బ్బిలాల నుంచి మ‌నుషుల‌కు క‌రోనా ఎలా వ్యాపించింద‌న్న విష‌యంపై ఇంకా పూర్తి వివ‌రాలు క‌నుగొనాల్సి ఉంద‌న్నారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు అమెరికా నిధులు నిలిపివేయ‌డంపై ఆమె స్పందిస్తూ ఆ ‌నిర్ణ‌యం వ‌ల్ల ఏర్ప‌డే ఖాళీల‌ను ఇత‌ర భాగ‌స్వామ్య దేశాలతో క‌లిసి పూరించుకుంటామ‌ని తెలిపారు. అలాగే ఇప్పుడు క‌రోనా ఒక్క‌టే కాకుండా పోలియో, మ‌లేరియా వంటి ఇత‌ర వ్యాధుల‌పై పోరాడేందుకు ఇంకా ఎన్నో ప‌నులు చేయాల్సి ఉంద‌న్నారు. కాగా ఈ ల్యాబ్‌పై త‌మ‌కు అనుమానాలున్నాయంటూ దాని కార్య‌క‌లాపాల‌పై ఓ క‌న్నేసి ఉంచుతామ‌ని అగ్ర‌రాజ్య అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న విష‌యం తెలిసిందే. క‌రోనాను చైనా కావాల‌నే సృష్టిస్తే మాత్రం తీవ్ర ప‌రిణామాలుంటాయ‌ని హెచ్చ‌రిక‌లు సైతం జారీ చేశారు. (ధారవీ..ఓ కరోనా బాంబ్!)

మరిన్ని వార్తలు