ప్రొఫెసర్‌ను, భార్యను కాల్చి.. ఆపై ఆత్మహత్య

3 Jun, 2016 08:14 IST|Sakshi
వర్సిటీ సిబ్బందిని బయటకు పంపుతున్న బలగాలు

హంతకుడి ఇంటినుంచి కిల్ లిస్టు స్వాధీనం
లిస్టులోని ఓ మహిళ మృతదేహం గుర్తింపు
అతడి భార్యే అయి ఉంటుందన్న పోలీసులు
3222 కిలోమీటర్లు కారులో వెళ్లి కాల్చిన మైనాక్ సర్కార్
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో పట్టభద్రుడు.. యూఎస్‌లో డాక్టరేట్
మరో ప్రొఫెసర్‌నూ చంపాలన్న యోచన

లాస్ ఏంజిలస్: అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజిలస్ (యూసీఎల్‌ఏ)లో భారతీయ విద్యార్థి మైనాక్ సర్కార్ (38) బుధవారం కాల్పులకు పాల్పడి ఓ ప్రొఫెసర్‌ను హత్యచేశాడు. ఆపై తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకోసం అతడు ఏకంగా దాదాపు 3222 కిలోమీటర్ల దూరం కారులో ప్రయాణించి వచ్చాడు. ఐఐటీ ఖరగ్‌పూర్ (ఏరోస్పేస్ ఇంజనీరింగ్) విద్యార్థి అయిన మైనాక్ సర్కార్..  యూసీఎల్‌ఏ ప్రొఫెసర్ విలియమ్ వద్ద డాక్టరేట్ విద్యార్థిగా ఉండేవారు. 2013లో డాక్టరేట్ పూర్తయింది.


కొంతకాలానికి తన కంప్యూటర్ కోడ్ చోరీ అయిందని గుర్తించిన ప్రొఫెసర్ విలియమ్ దీన్ని మైనాక్ దొంగిలించి వేరేవాళ్లకు ఇచ్చాడని ఆరోపించారు. దీంతో మైనాక్ సామాజిక మాధ్యమంలో ప్రొఫెసర్‌పై బహిరంగంగానే విమర్శలు చేశాడు. ఈ నేపథ్యంలో తాజా దారుణం జరిగింది. అయితే.. మినసొటాలోని మైనాక్ నివాసంలో సోదాలు నిర్వహించగా.. ఓ ‘కిల్ లిస్ట్’ దొరికింది. ఇందులో ఒకరు ఇదే వర్సిటీ ప్రొఫెసర్, మరో మహిళ పేరును గుర్తించారు. అయితే.. ఆమె చిరునామా ఆధారంగా ఇంటికి వెళ్లేసరికే ఆ మహిళ చనిపోయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె అతడి భార్య అయి ఉంటుందని భావిస్తున్నారు. ఆష్లీ హస్తి అనే మహిళతో సర్కార్‌కు 2011లో పెళ్లయింది. అయితే వాళ్లిద్దరూ ఇంకా కలిసి ఉంటున్నారా లేదా అనే విషయం మాత్రం నిర్ధారణ కాలేదు. బుధవారం జరిగిన ఈ హత్యతో యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేశారు.

వాస్తవానికి మరో ప్రొఫెసర్‌ను కూడా చంపాలని మైనాక్ సర్కార్ యూనివర్సిటీకి వెళ్లాడు. అయితే సమయానికి రెండో ప్రొఫెసర్ వర్సిటీలో లేకపోవడంతో ఒక్కరిని మాత్రమే చంపి ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి వద్ద రెండు ఆటోమేటిక్ రైఫిళ్లు, పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. క్లగ్ అసలు ప్రొఫెసర్‌లా ఉండాల్సిన వ్యక్తి కాదని, అమెరికాకు కొత్తగా వచ్చేవాళ్లు అతడివద్దకు వెళ్లొద్దని అంతకుముందు సర్కార్ తన సోషల్ మీడియా అకౌంట్లలో రాశాడు.

మరిన్ని వార్తలు