అభివృద్ధిపై ఆశలు

12 Mar, 2019 14:31 IST|Sakshi
బుగ్గారం మండల కేంద్రం ముఖచిత్రం 

బుగ్గారంలో ఏర్పాటు కానున్న మండల ప్రజాపరిషత్‌

హర్షం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు

సాక్షి, బుగ్గారం: ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రంగా ఉన్న బుగ్గారం ప్రాంతం నుంచి రాష్ట్ర రాజకీయాల్లో మంచి గుర్తింపు పొందిన ఎంతోమంది ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. అయినా బుగ్గారం గ్రామం, దాని చుట్టుపక్కల గ్రామాలు చెప్పుకోదగ్గ అభివృద్ధి సాధించలేదు. తరువాత 2009 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ కేంద్రాన్ని ధర్మపురికి మార్చారు. దీంతో ఇక అభివృద్ధి ఉండదని గ్రామస్తులు అనుకున్నారు.

తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం మొదటిసారి కొలువుదీరిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. ఈ పునర్విభజనలో భాగంగా ధర్మపురి మండలంలో అంతర్భాగంగా ఉన్న బుగ్గారంను ధర్మపురి మండలంలోని 8 గ్రామాలు, గొల్లపల్లి మండలంలోని మూడు గ్రామాలతో కలిపి మొత్తం 11 గ్రామాలతో నూతన మండలకేంద్రంగా ఏర్పాటు చేశారు.

దీంతో బుగ్గారంలో తహసీల్దార్‌ కార్యాలయం, వ్యవసాయ కార్యాలయం, పోలీస్‌స్టేషన్‌ తదితర కార్యాలయాలు నెలకొల్పారు. స్థానిక ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే మండల ప్రజాపరిషత్‌ సంబంధమైన పనులు మాత్రం ధర్మపురిలోని ఎంపీపీ కార్యాలయం నుంచే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల దరిమిలా పాత ప్రాదేశిక స్థానాల్లో మార్పులు జరిగి నియోజకవర్గంలోని 6 మండలాల్లో 75 ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో నూతనంగా ఏర్పడ్డ బుగ్గారం మండలంలో ఈసారి మండల ప్రజాపరిషత్‌ ఏర్పాటు చేయనున్నారు. దాంతోపాటు మండలం నుంచి నూతనంగా జెడ్పీ స్థానం కూడా ఖరారు చేశారు.


11 గ్రామాలు.. 6 ఎంపీటీసీ స్థానాలు
బుగ్గారం మండలంలో మొత్తం 11గ్రామాలకు గానూ 6ఎంపీటీసీ స్థానాలు ఖరారు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 21,716 కాగా.. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ప్రకారం మొత్తం మండల ఓటర్లు 16,493. ఇంతకుముందు ధర్మపురి మండల పరిధిలో ఉన్నప్పుడు బుగ్గారంలోని 8 గ్రామాలకు గానూ 5 ఎంపీటీసీ స్థానాలుండేవి. ప్రస్తుతం గొల్లపల్లి నుంచి కలిసిన మూడు గ్రామాలైన శెకెల్ల, యశ్వంతరావుపేట, గంగాపూర్‌ గ్రామాలతో మరో ఎంపీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేయడంతో మండలంలో మొత్తం ఆరు ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటయ్యాయి.

దీంతోపాటు మండలం నుంచి ఈసారి జెడ్పీటీసీ స్థానం కూడా ఏర్పడడంతో స్థానిక సంస్థల పాలన ప్రజలకు మరింత చేరువై సమర్థవంతంగా కొనసాగే అవకాశం ఉంటుందని నాయకులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ధర్మపురి కేంద్రంగా కొనసాగిన పంచాయతీల పాలనా వ్యవహారాలు త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అనంతరం మండలకేంద్రం నుంచే గ్రామాల పాలనా వ్యవహారాల పర్యవేక్షణ జరుగుతుంది. దీంతో మండలంలో అభివృద్ధి పనుల్లో వేగం పెరిగి గ్రామాల ముఖచిత్రం మారే అవకాశాలున్నాయి. జెడ్పీ నిధులు కూడా నేరుగా మండలానికే రానుండడంతో అభివృద్ధిలో వేగం పెరిగే అవకాశాలుంటాయని నాయకులంటున్నారు.


యువత ఆసక్తి
త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ బలాబలాలను గురించి లెక్కలు వేసుకుంటూ స్థానిక ప్రజల వద్ద అభిప్రాయాలు సేకరిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓడిపోయిన అభ్యర్థులు, రిజర్వేషన్‌ అనుకూలించనివారిలో కొంతమందికి ప్రస్తుతం ఖరారు చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు కలిసి వస్తుండడంతో మళ్లీ ఎన్నికల సమరంలో దిగడానికి సిద్ధమౌతున్నారు.

పార్టీల గుర్తులపై ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధిక మంది ఔత్సాహికులు తమతమ పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మరికొంతమంది యువకులు, నాయకులు తమకు పార్టీ టికెట్‌ రాకున్నా స్వతంత్రంగానైనా పోటీ చేయాలనే యోచనలో ఉన్నారు. తమకున్న కుల బలం, ఇతర అంశాలపై లెక్కలు వేసుకుంటున్నారు. కేవలం 6 ఎంపీటీసీ స్థానాలతో ఏర్పడ్డ చిన్న మండలం కావడంతో మరికొంతమంది ఎంపీపీ స్థానంపై కన్నేశారు. ఇదిలా ఉండగా.. మండలంలోని ఎంపీపీ, జెడ్పీ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో పలు పార్టీల పెద్దలు మండలంలోని గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు. ప్రజాదరణతోపాటు అంగబలం, ఆర్థిక బలం కలిగిన నాయకుల కోసం పార్టీలు అన్వేషణ సాగిస్తున్నాయి.

Read latest Jagtial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు