Telangana News: రైలొచ్చింది.. 21 కి.మీ దూరంలో ఉన్నది!
Sakshi News home page

రైలొచ్చింది.. 21 కి.మీ దూరంలో ఉన్నది!

Published Fri, Sep 8 2023 1:04 AM

- - Sakshi

కరీంనగర్‌: ఉమ్మడి జిల్లాలో రైల్వే పనులు ఊపందుకున్నాయి. కొత్తపల్లి– మనోహరాబాద్‌ లైన్‌ పనులు వడివడిగా సాగుతున్నాయి. ఈ మార్గంలో ఇప్పటికే సిద్దిపేట వరకు రైలొచ్చింది. మిగిలిన రూట్లలోనూ పనులు స్పీడందుకున్నాయి.

సిద్దిపేట తర్వాత గుర్రాలగొంది, చిన్నలింగాపూర్‌, సిరిసిల్ల స్టేషన్ల నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే టెండర్లు జారీ చేసింది. ప్లాట్‌ఫాంలు, భవనాలు, గదులు, అప్రోచ్‌ రోడ్లు, లైటింగ్‌, విద్యుత్‌ యార్డు తదితర పనుల కోసం టెండర్లు జారీచేశారు. మొత్తం టెండరు విలువ రూ. 5,30,27,277గా అధికారులు పేర్కొన్నారు. ఈనెల 25న మధ్యాహ్న 3 గంటలకు టెండరు ముగింపు గడువుగా తెలిపారు. పనులు ఏడాదిలోగా పూర్తి చేయాలని టెండరులో సూచించారు.

21 కి.మీ. దూరంలో పాత కరీంనగర్‌..
సిరిసిల్ల–సిద్దిపేట మధ్యలో 30 కి.మీ దూరానికి ట్రాక్‌ వేసేందుకు దాదాపు రూ.440 కోట్ల వ్యయంతో జనవరిలోనే దక్షిణ మధ్య రైల్వే బిడ్డింగులు పిలిచింది. తాజాగా సిరిసిల్ల, గుర్రాలగొంది, చిన్నలింగాపూర్‌లలోనూ స్టేషన్‌ నిర్మాణాలకు దక్షిణ మధ్య రైల్వే టెండర్లు పిలవడంతో ఈ మార్గంలో జరుగుతున్న పనుల వేగానికి నిదర్శనం. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాను హైదరాబాద్‌తో కలిపే కొత్తపల్లి–మనోహరాబాద్‌ రైల్వేలైను ప్రస్తుతం సిద్ధిపేట వరకు పూర్తయింది.

ఇటీవల సిద్ధిపేటను రైలు కూడా పలకరిచింది. సిద్దిపేట తర్వాతి స్టేషన్‌ గుర్రాలగొంది కేవలం 10 కి.మీ దూరంలో ఉంటుంది. గుర్రాలగొంది– చిన్నలింగాపూర్‌ మధ్య దూరం 11 కి.మీ. చిన్నలింగాపూర్‌–సిరిసిల్ల మధ్య 9.కి.మీ దూరం వస్తుంది. గుర్రాలగొంది సిద్దిపేట జిల్లా కాగా, చిన్నలింగాపూర్‌ సిరిసిల్ల జిల్లాలో ఉంటుంది. ఈ లెక్కన కొత్తపల్లి–మనోహరాబాద్‌ రైల్వే మార్గం పాత ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ప్రవేశించేందుకు కేవలం 21.కి.మీల దూరంలో ఉంది.

77 కి.మీ. మేర పూర్తయిన మార్గం..
మనోహరాబాద్‌ –కొత్తపల్లి (కరీంనగర్‌) వరకు మొత్తం 151.36 కిలో మీటర్లు బ్రాడ్‌గేజ్‌లైన్‌. ఈ మార్గంలో ప్రస్తుతం సిద్దిపేట స్టేషన్‌ (77కి.మీ) వరకు లైన్‌ పూర్తయింది. ఇక్కడి నుంచి దాదాపు 30 కి.మీ దూరంలో ఉన్న సిరిసిల్ల స్టేషన్‌ (106.88 కి.మీ) వరకు ప్రస్తుతం పనులు వేగంగా నడుస్తున్నాయి. అక్కడ నుంచి కరీంనగర్‌ వరకు (151.36 కి.మీ) అంటే దాదాపు 44.48 కి.మీ వరకు ట్రాక్‌ పనులు సాగాలి. ఇవి 2025 మార్చి వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

సిరిసిల్లలో కావాల్సిన భూసేకరణకు అధికారులు ఇప్పటికే పచ్చజెండా ఊపారు. దక్షిణ మధ్యరైల్వే అడిగిన భూమిని అటవీ భూమిని ఇచ్చేందుకు ఇటీవల సిరిసిల్ల కలెక్టర్‌ అనుమతించారు. భూసేకరణ విషయంలో రైల్వే అధికారులతో సిరిసిల్ల–కరీంనగర్‌ కలెక్టర్లు కూడా పలుమార్లు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ మార్గం పూర్తయితే జగిత్యాల, పెద్దపల్లి వాసులకు ఢిల్లీ, హైదరాబాద్‌ వెళ్లేందుకు రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తుంది.

ప్రాజెక్టు నేపథ్యం ఇదీ..
వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట ప్రజలకు రైలు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో 2006–07లో 151 కి.మీ కొత్తపల్లి– మనోహరాబాద్‌ రైల్వే లైన్‌ కోసం రూ.1,167 కోట్ల అంచనా వ్యయం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

తర్వాత ఈ మార్గం ఆర్థికంగా భారమని చెప్పి రైల్వేశాఖ సుముఖత చూపలేదు. మొత్తం బడ్జెట్‌లో 1/3 వంతు ఖర్చుతోపాటు 100 శాతం భూమిని సేకరించి ఇవ్వడం, ఈ మార్గంలో ఐదేళ్లపాటు వచ్చే నష్టాలను భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకువచ్చింది. దీంతో 2016లో ఈ ప్రాజెక్టు తిరిగి పట్టాలెక్కింది. ఈప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని ఉమ్మడి జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Advertisement
Advertisement