వజ్రం వివాదం

29 Jan, 2018 09:19 IST|Sakshi

కర్నూలు, ఆదోని అర్బన్‌: పట్టణంలోని బీరప్పనగర్‌లో వజ్రం అమ్మకం వివాదంగా మారింది. ఓ నాయకుడి జోక్యంతో వివాదం మరింత ముదిరే అవకాశం ఉండడంతో ఓ కుటుంబం వజ్రం అమ్ముకున్న డబ్బుతో ఉడాయించినట్లు ప్రచారం జరుగుతోంది.  స్థానికుల సమాచారం మేరకు.. నెల రోజుల క్రితం ఓ ఫ్యాక్టరీలో బీరప్ప నగర్‌కు చెందిన ఓ దినసరి మహిళా కూలీకి వేరుశనగ దిగుబడులను శుభ్రం చేస్తుండగా తళుకులీనుతున్న ఓ చిన్న గాజు లాంటి రాయి దొరికింది. ఆ రాయిని పక్కనే ఉన్న ఓ మహిళకు చూపించింది. దీంతో ఆమె భర్తతో కలిసి రాయిని తీసుకుని తుగ్గలి మండలం పెరవలిలోని వజ్రాల వ్యాపారికి సంప్రదించగా వజ్రంగా గుర్తించిన ఆయన రూ.20 లక్షలకు కొనుగోలు చేశాడు.

అయితే వజ్రం ఇచ్చిన మహళ సదరు మహిళను ప్రశ్నించగా అది మెరిసే రాయని, పిల్లలు ఎక్కడో పడేశారని చెప్పుకొచ్చింది. అయితే రూ.20 లక్షలకు వజ్రాన్ని అమ్మారని తెలియడంతో రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు ఐదు తులాల బంగారం ఇస్తామని, గొడవ చేయొద్దని వజ్రం అమ్ముకున్న మహిళా కుటుంబం బేరానికి దిగింది. అయితే ఇందుకు వజ్రం దొరికిన మహిళ అంగీకరించలేదు. తాను పోలీసులను ఆశ్రయిస్తానని చెప్పడంతో వజ్రం అమ్ముకున్న మహిళ సూసైడ్‌ నోట్‌లో నీపేరు రాసి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది.

వివాదం బహిరంగం కావడంతో ఆ వీధికి చెందిన ఓ నాయకుడు జోక్యం చేసుకుని వజ్రం అమ్ముకున్న కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు తెలిసింది. వివాదం ముదరడంతో భయపడిన వజ్రం అమ్ముకున్న మహిళ కుటుంబం మూడు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి ఊరొదిలి వెళ్లింది. 

మరిన్ని వార్తలు