ఈ నిర్ణయం మాత్రం నేనొక్కదాన్నే తీసుకుంటున్నా!

22 Jan, 2020 16:19 IST|Sakshi

ఎక్కడికి చేరుకుంటుందో తెలీదు నా ఈ ప్రయాణం. కదిలే ఈ రైలు కంటే వేగంగా కొట్టుకుంటుంది నా హృదయం. గుండెలో జరిగే ఈ సంఘర్షణలో  కొన్ని సంవత్సరాలు వెనుకకు వెళ్ళగానే నీ జ్ఞాపకాల వరదలో మునిగిపోయాను. మనం గడిపిన క్షణాలు, నేను  పొందిన అనుభూతులు, మధురస్మృతులన్ని  ఒకొక్కటిగా నా కళ్ళ ముందు  కనిపిస్తున్నాయి.  నువ్వు నా నుంచి  దూరమై నీ తల్లిదండ్రులకి నచ్చిన జీవితాన్ని గడుపుతున్నావు. నీకు ముందే తెలుసు మన పెళ్లి జరగదని మరెందుకు నా జీవితంలోకి వచ్చావు. నవ్వుతు నవ్విస్తూ ఆనందంగా గడుపుతుంటే ఎందుకు నా  జీవితాన్ని శోకంలోకి నెట్టేశావ్  కార్తీక్.... సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం పరిచయమయ్యాడు కార్తీక్...చదువు పూర్తి చేసి నాకు నచ్చిన వృత్తిలో స్థిరపడ్డాను.

ఎఫ్.ఎం లో ఆర్ జేగా నాకు నచ్చినట్టు నేను జీవిస్తున్న రోజుల్లో అనుకోకుండా ఒక ఆర్గనైజషన్ ద్వారా పరిచయమయ్యాడు.. మొదటి సారి చూసినప్పుడే అందరికి నచ్చేసే వ్యక్తి కార్తీక్. ఆరడుగుల ఎత్తు,  మంచి రంగుతో  ఉంటాడు ఎవ్వరినైనా మాటల్తో ఇట్టే ఆకట్టుకునే నేర్పరితనం ఉన్నవాడు. బహుశా ఆ మాటలే నన్ను అతని మాయలో పడేశాయేమో... మొదటి పరిచయంలోనే నాకు చాలా నచ్చేశాడు. కానీ అమ్మాయిని కదా బయటపడలేదు. అప్పటి వరకు మెసేజ్ ల వరకే పరిమితమైన మా పరిచయం సంవత్సరం తర్వాత  మొదటి కలయికతో రోజు ఫోన్ లో గంటల తరబడి మాట్లాడుకునే వరకు వెళ్ళింది. సిగ్గువిడిచి ఒకరోజు నేనే కార్తీక్ ని  ఇష్టపడుతున్నానని చెప్పేశా. నిన్ను నేను  ఇష్టపడుతున్నానని నాకు  చెప్పిన వాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ నా లైఫ్ లో నువ్వంటే నాకు ఇష్టం అని నేను చెప్పిన మొదటి వ్యక్తి కార్తీక్. తన సమాధానంతో నా ఆశలు నిరాశగా మిగిలాయి. ఈ ప్రేమ, పెళ్లి నాకు సెట్ అవ్వవు అన్నాడు. కొన్నిరోజులు మాట్లాడకుండా దూరంగా ఉన్నాను కానీ నా వల్ల కాలేదు ఎప్పటికైనా నా ప్రేమని అర్ధం చేసుకుంటాడని రాధనై చిన్ని కృష్ణుడికోసం ఎదురు చూశాను. ఆరు నెలల తర్వాత అనుకోకుండా కలిసిన కార్తీక్ నుంచి అనుకోని స్పందన,  ఐ లవ్ యూ అనే మూడు పదాలు నన్ను కొత్త లోకానికి తీసుకెళ్లాయి..కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది ఈ ప్రేమ.రోజు గంటలు తరబడి ఫోన్లు, నిమిషానికో మెసేజ్ ఇలా సాగిపోయింది మా ప్రేమ ప్రయాణం. అనుకోని అనూహ్య సంఘటనలు, ప్రమాదాల కలయికే జీవిత ప్రయాణం.

ప్రశాంతంగా సాగిపోతున్న నా ప్రేమ కథలోకి వచ్చిందో ప్రమాదం(కార్తీక్ లైఫ్ లోకి మరో అమ్మాయి ) మా మధ్య ఏమిలేదని తను చెప్తున్నా వినిపించుకునేదాన్ని కాదు. ఎంతైనా అమ్మాయిని కదా అనుమానం మా జన్మహక్కు..ఆమె రాక మా ఇద్దరినీ మరింత దగ్గర చేసింది. కార్తీక్ ని ఎక్కడ కోల్పోతానో అనే నా భయం తనకి నన్ను మరింత చేరువ చేసింది. నాలో నేను లేను. మనసు,  తనువు, ప్రాణం తనదిగా మారిపోయాయి..ఒకరిని విడిచి ఒకరం ఉండలేని  అనుబంధం మా మధ్య ఏర్పడింది. తెలియకుండానే ఒకరంటే ఒకరికి ప్రాణమయిపోయాం. ఏ దేవుడు మమ్మల్ని విడదీయలేడు అనుకున్నా... అది అపోహే అని సంవత్సరం తర్వాత తెలిసింది. కార్తీక్ కి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. అంతే నా ప్రాణం పోయినంత పనైంది. తన ఫ్యామిలీకి నన్ను పరిచయం చేశాడు. వారికి దగ్గరవడానికి ప్రయత్నించాను.అందరికి నచ్చాను కానీ ఏం చేస్తాం విధి రాతని ఎవరూ మార్చలేరు.

ఏ దేవుడు విడదీయలేడు అనుకున్న మా ప్రేమని కులం విడదీయగలదని అర్ధం అయ్యింది. తనకి ముందే తెలుసు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరని అందుకే నేను నా ప్రేమని వ్యక్త పరచినప్పుడు ఒప్పుకోలేదు. అలాగే ఒప్పుకోకుండా ఉండుంటే బాగుండేదేమో చాలా దగ్గరైపోయాడు.  నా రోజు తన మాటతోనే మొదలవుతుంది. తన మాటతోనే ముగుస్తుంది. ఎంత బిజీ గా ఉన్న నాకు గుడ్ నైట్ చెప్పనిదే పడుకునేవాడు కాదు. తనతో జీవితాంతం ఎలా ఉండాలి, అత్తమామల్ని ఎలా చూసుకోవాలని అనే ఊహల్లోనే గడిచేయేవి రోజులన్నీ.తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది కదా, నా ప్రేమ విషయంలో కూడా అదే జరిగింది. నా ముందున్న అతి పెద్ద సమస్య మా పెళ్లి. కార్తీక్ నేనెవరిని పెళ్లి చేసుకోనని పట్టుబట్టాడు నాకోసం. తన ఫ్యామిలీ చాలా బాధపడ్డారు.కానీ కొడుకు కోసం కులమనే కట్టుబాట్లను మాత్రం తెంపలేకపోయారు. ఆనాటి రాముడు తండ్రి మాటకోసం అడవులకి వెళ్లినట్టు..ఈనాటి నా ఈ రాముడు తన  తల్లిదండ్రుల కోసం తల వంచక తప్పలేదు.  ప్రేమకి రెండు మనసులు కలిస్తే సరిపోతుంది కానీ పెళ్ళికి రెండు కుటుంబాల అనుమతి కావాలి.

నా వైపు నుంచి పెళ్ళికి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఒకే చేతితో చప్పట్లు మొగవుగా. నువ్వు ముందే చెప్పావు  ఇలాగే అవుతుందని కానీ నేనే  పట్టించుకోలేదు. నీతో కలిసి తీరం చేరలేనని తెలిసి కూడా అడుగేసేశా. అది నీ తప్పు కాదు నా పిచ్చితనమే. అప్పుడే కాస్త గట్టిగా చెప్పాల్సింది. వదిలేసి నీకు దూరంగా ఉంటున్నప్పుడు మళ్ళీ నా దగ్గరికి నువ్వు రాకుండా ఉంటే ఇంత బాధ ఉండేది కాదేమో. నీ దగ్గర్లోనే ఉంటే నా బాధని చూడలేవు, అటు నీ తల్లిదండ్రులకి ఇచ్చిన మాటని నిలబెట్టలేవు. అందుకే మొదటిసారి మన లైఫ్ కి సంబందించిన నిర్ణయం నేనే తీసుకుంటున్నా. నీకు దూరంగా వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నా, ఎంత ఓర్చుకుంటున్నా నీ  జ్ఞాపకాలు పదే పదే గాయం చేస్తూనే ఉన్నాయి. కొన్నిసార్లు అనిపిస్తుంది మనం ప్రేమించిన వారితో జీవితం గడపలేనప్పుడు,  వారి జ్ఞాపకాలతోనే జీవితం గడిపితే  మంచిదని..కానీ నీకోసం పడే ఈ బాధ కూడా నాకు మధురంగానే  ఉంది. నీ తల్లిదండ్రులని ఒప్పించుకొని నన్ను చేరుకుంటావో, తలవంచి వేరొకరి మేడలో తాళి కడతావో. ఏదైనా నేను అంగీకరిస్తాను..అనుమతితో వస్తాని హామీ ఇస్తానంటే జీవితాంతం ఎదురు చూస్తూనే ఉంటాను. లేదంటే ఇక నువ్విచ్చిన ఈ మధురస్మృతులతోనే జీవితం గడిపేస్తుంది నీ ఈ అమ్ములు. 

అమ్ములు ( హైదరాబాద్‌).

మరిన్ని వార్తలు