ఆ భయం నా కోపాన్ని చంపేసింది..

16 Feb, 2020 15:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

2012లో బీటెక్‌ ఫేయిలై నేను ఇంటి దగ్గర ఉన్నా. ఏమీ తోచేది కాదు.. ఇంట్లో వాళ్లు నన్ను తిట్టని తిట్టులేదు. బాగా ఇబ్బంది పడ్డరోజులవి. ఇంట్లో దిక్కుతోచక ఓ బట్టల షాపులో పనికి కుదిరా. ఉదయం వెళితే.. రాత్రి పదయ్యేది ఇంటికి వచ్చేసరికి. పైగా తక్కువ జీతం! కానీ, తప్పలేదు. నాకు ఏపనైనా ఎక్కువ రోజులు చేయటం ఇష్టముండేదికాదు. అందుకే రోజురోజుకు నాకు పని మీద శ్రద్ధ తగ్గుతూ వచ్చేది. నాతోపాటు పనిచేసే ఓ అమ్మాయి పని మానేయటంతో పనిభారం కూడా పెరిగింది. దీంతో నేను పని మానేయాలని ఫిక్స్‌ అయ్యా!. అలాంటి సమయంలో షాపులో సేల్స్‌గర్ల్‌గా చేరిందో అమ్మాయి! పేరు సుహాసిని. చూడ్డానికి చాలా అందంగా ఉండేది. కానీ, నేను అంతగా తనవైపు చూసేవాడిని కాదు. అప్పుడప్పుడు అవసరం ఉన్నపుడు మాట్లాడేవాడ్ని. ఓసారి అర్జంటు ఎగ్జామ్‌ ఫీజు కట్టడానికి కొంత డబ్బు కావాల్సి వచ్చింది. ఎవరిని అడగాలో తెలియలేదు. షాపులో ఇదివరకే బాకీ ఉంది. అడగటానికి ఇబ్బందిపడ్డా! ధైర్యం చేసి అడిగా. ఓనర్‌ ఊర్లో లేడు! ఇవ్వటం కుదరదన్నాడు మేనేజర్‌. కొద్దిగా మనసు చివుక్కుమంది.

 ఏదో ఆలోచిస్తున్నాను. ఇంతలో ఎవరో పిలుస్తున్నట్లు అనిపించింది. పక్కకు చూశా..‘ మీకు అభ్యంతరం లేకపోతే నా దగ్గర కొంత డబ్బుంది తీసుకోండి! తర్వాత ఇద్దరు గానీ’ అంది. ఓ పక్క అవసరం.. మరోపక్క మొహమాటం.. అవసరమే గెలిచింది. ‘వీలైనంత తొందరగా తిరిగిచ్చేస్తాను’ కాస్త బొంగురుపోయిన గొంతుతో అన్నాను. ‘పర్లేదు! మీకు వీలైనప్పుడే ఇ‍వ్వండి’ అంది నవ్వుతూ. నాకప్పటినుంచి తనంటే గౌరవం పెరిగింది. నా చేతికి డబ్బు రాగానే తన డబ్బు తిరిగిచ్చేశాను. నాకే కాదు తను నా కళ్లముందే చాలా మందికి సహాయం చేసింది. తనపై ఉన్న గౌరవం కాస్తా! ఆరాధనగా మారింది.

కొన్ని నెలలు తనను మూగగా ఆరాధించా. ఓసారి సుహాసిని ఇంటికి వెళ్లే సమయంలో నేను కూడా తన వెంట వెళ్లాను. ప్రేమిస్తున్న సంగతి చెప్పేశా! తను ఆలోచించుకుని చెబుతా అంది. మరుసటి రోజు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నా. తనురాలేదు. వరుసగా మూడు రోజులు గడిచిపోయాయి. నాకు భయం వేసింది! నా ప్రేమ సంగతి చెప్పి తనను ఇబ్బంది పెట్టాననిపించింది. నా బాధకు అడ్డులేకుండా పోయింది. ఆలోచనలతో రాత్రిళ్లు నిద్రకూడా పట్టలేదు. మరసటి రోజు నీరసంగానే షాపుకు వెళ్లా. కొద్దిసేపటి తర్వాత తను వచ్చింది. నా పెదవులపైకి చిరునవ్వులు తెచ్చింది. కొద్దిగా కోపం కూడా వచ్చింది. ఏం అయ్యుంటుందోనన్న భయం నా కోపాన్ని చంపేసింది. ‘‘ఏం జరిగింది! మూడు రోజులు ఎందుకురాలేదు. నా ప్రేమ సంగతి నీకు చెప్పి ఇబ్బంది పెట్టినందుకు సారీ! ఇకమీదట నిన్ను ఇబ్బంది పెట్టను’ అన్నాను కొంచెం బాధగా.

‘అదేం లేదు! మా అమ్మకు ఒంట్లో బాగోలేకపోతే ఇంటి దగ్గర ఉండాల్సి వచ్చింది.’ చెప్పింది. ఆ మాటలు నాలో కొండంత ధైర్యం నింపాయి. వెంటనే నా ప్రేమ సంగతి అడగాలనిపించింది. కానీ, బాగోదని ఆగిపోయా. అప్పుడు తనే‘ ప్రేమ! గీమా అంటే మా ఇంట్లో కుదరదు. మా వాళ్లతో మాట్లాడి ఒప్పించండి.’ అంది. ఇది చాలు అనుకున్నా! మా ఇంట్లో వాళ్లను ఒప్పించి, వాళ్లింటికి తీసుకెళ్లాను. ఇది వరకే మా నాన్నకు వాళ్లతో పరిచయం ఉండటంతో మంచి ఉద్యోగం వస్తే పెళ్లి చేయటానికి అభ్యంతరం లేదన్నారు. సబ్జెక్టులు కంప్లీట్‌ చేయటం, ఉద్యోగంలో చేరిపోవటం అంతా చకచకా జరిగిపోయింది. 2019 నవంబర్‌లో మాకు ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. మార్చిలో పెళ్లి చేసుకోబోతున్నాం. నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను.
- నవీన్‌ కుంట, నంద్యాల


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు