హీరోయిన్లు తెలుగు మాట్లాడకపోతే వాకౌట్ చేస్తా!

12 Oct, 2016 22:51 IST|Sakshi
హీరోయిన్లు తెలుగు మాట్లాడకపోతే వాకౌట్ చేస్తా!

‘‘తెలుగు ఇండస్ట్రీ రాను రాను ఇంగ్లీష్ ఇండస్ట్రీ అయిపోయింది. ఆర్టిస్టులందరూ ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతున్నారు. టైటిళ్లు కూడా ఇంగ్లీష్‌లోనే పెడుతున్నారు. శోభారాణికి సినిమాలంటే ప్యాషన్. తమిళ చిత్రాలు డబ్బింగ్ చేసి ఎంత డబ్బు పోగొట్టుకుందో నాకు తెలుసు. ‘ఎందుకమ్మా అంత డబ్బు పెట్టి డబ్బింగ్ సినిమాలు కొనడం, సొంతంగా ఓ చిత్రం నిర్మించు’ అన్నా. ఇప్పుడు తను ఓ మంచి కథతో సినిమా నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. మిత్రన్ ఆర్.జవహర్ దర్శకత్వంలో తెలుగు, తమిళంలో సీఎల్‌ఎన్ మీడియాపై శోభారాణి నిర్మిస్తున్న ‘100 డిగ్రీ సెల్సియస్’ చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది.

హీరోయిన్లు రాయ్‌లక్ష్మీ, నికిషా పటేల్, అరుంధతి నాయర్‌లపై దాసరి క్లాప్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- ‘‘ఇండియాలోని అన్ని భాషల హీరోయిన్స్‌ను తెలుగు ఇండస్ట్రీ గౌరవిస్తుంది. సో, హీరోయిన్స్ ఫస్ట్ తెలుగు నేర్చుకొని ఇండస్ట్రీకి రావాలి. ఇది నా సిన్సియర్ అండ్ సీరియస్ సలహా. ఈ హీరోయిన్స్ నెక్ట్స్ నేనున్న స్టేజ్‌పైకి వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడకపోతే వాకౌట్ చేస్తా’’ అన్నారు. ఇదే వేదికపై ‘కోటికొక్కడు’ చిత్రం ఆడియో వేడుక జరిగింది.

సుదీప్, నిత్యామీనన్ జంటగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో కన్నడ, తమిళంలో తెరకెక్కిన చిత్రాన్నే ‘కోటికొక్కడు’ పేరుతో సిఎల్‌ఎన్ మీడియా, లగడపాటి శ్రీనివాస్, గూడూరి గోపాల్‌శెట్టి తెలుగులో విడుదల చేస్తున్నారు. డి.ఇమ్మాన్ స్వరపరచిన ఈ చిత్రం ఆడియో సీడీలను దాసరి, సముద్ర విడుదల చేశారు. ఈ వేడుకల్లో నిర్మాతలు శోభారాణి, ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డీఎస్ రావు, ప్రతాని రామకృష్ణగౌడ్, హీరోలు భరత్, మనోజ్ నందమ్ పాల్గొన్నారు.