‘అభిమన్యుడు’ మూవీ రివ్యూ

1 Jun, 2018 10:15 IST|Sakshi

టైటిల్ : అభిమన్యుడు
జానర్ : యాక్షన్‌ థ్రిల్లర్‌
తారాగణం : విశాల్‌, అర్జున్‌, సమంత, ఢిల్లీ గణేష్‌ తదితరులు
సంగీతం : యువన్‌ శంకర్‌ రాజా
నిర్మాత : విశాల్‌
దర్శకత్వం : పీఎస్‌ మిత్రన్‌

కోలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో విశాల్‌, టాలీవుడ్‌లో మార్కెట్‌ సాధించేందుకు చాలా రోజులుగా కష్టపడుతున్నాడు. గతంలో అతను నటించిన కొన్ని చిత్రాలు ఇక్కడా విజయాలు సాధించి విశాల్‌కు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. అదే ఊపులో మరో డిఫరెంట్‌ ఎంటర్‌టైనర్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశాల్‌. కోలీవుడ్‌ లో ఘనవిజయం సాధించిన ఇరుంబు తిరై సినిమాను తెలుగులో అభిమన్యుడు పేరుతో అనువాదం చేసి రిలీజ్ చేశారు. మరి అభిమన్యుడుగా విశాల్ ఆకట్టుకున్నాడా..? కోలీవుడ్‌లో సూపర్‌ హిట్ అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించిందా..?  చూద్దాం

కథ :
కరుణ(విశాల్) ఆర్మీ మేజర్‌. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని ఆవేశపరుడైన ఆఫీసర్‌. కుటుంబ సమస్యల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో కరుణ ఫేక్‌ డాక్యుమెంట్స్‌తో లోన్‌ తీసుకోవాల్సి వస్తుంది. కానీ తీసుకున్న లోన్‌ డబ్బులు నిమిషాల్లోనే బ్యాంక్‌ ఎకౌంట్‌ నుంచి మాయం అవుతాయి. దీంతో హీరో ఏం చేయాలలో తెలియని పరిస్థితుల్లో నిస్సహాయుడిగా మిగిలిపోతాడు. హీరో అకౌంట్‌ నుంచి డబ్బు ఎలా మాయం అయ్యింది..? ఈ నేరాల వెనకు ఉన్న వైట్‌ కాలర్ పెద్ద మనిషి ఎవరు..? ఈ సైబర్‌ క్రైమ్‌ను హీరో ఎలా చేధించాడు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
విశాల్‌ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో మరింత మెచ్యూర్డ్‌గా కనిపించాడు. ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్‌లో విశాల్ నటన ఆకట్టుకుంటుంది. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. మిలటరీ ఆఫీసర్‌గా విశాల్‌ లుక్‌ సూపర్బ్‌ అనిపించేలా ఉంది. సినిమాలో మరో కీలక పాత్ర ప్రతినాయకుడు అర్జున్‌. వైట్‌ డెవిల్‌ పాత్రకు అర్జున్‌ వంద శాతం న్యాయం చేశాడు. అర్జున్‌ను తప్ప మరొకరిని ఆ పాత్రలో ఊహించుకోలేని స్థాయిలో ఉంది ఆయన నటన. ముఖ్యంగా విశాల్‌, అర్జున్‌ల మధ్య వచ్చే సన్నివేశాల్లో ఇద్దరి నటన సూపర్బ్‌. హీరోయిన్‌ సమంత రెగ్యులర్‌ కమర్షియల్ సినిమా హీరోయిన్‌ పాత్రే. పాటలు, కామెడీ సీన్స్‌ తప్ప ఆ పాత్ర గురించి పెద్దగా చెప్పుకోవటానికేం లేదు.

విశ్లేషణ :
దర్శకుడు మిత్రన్‌ నేటి డిజిటల్‌ లైఫ్‌కు తగ్గ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశాల్ బాడీ లాంగ్వేజ్‌ ఇమేజ్‌కు తగ్గట్టుగా అభిమన్యుడు సినిమాను రూపొందించాడు. ముఖ్యంగా సైబర్‌ క్రైమ్‌ కు సంబంధించి సన్నివేశాలను తెరకెక్కించేందుకు మిత్రన్‌ చేసిన పరిశోధన తెర మీద కనిపిస్తుంది. వ్యక్తిగత సమాచారం ఎలా చోరికి గురవుతుందన్న అంశాలను చాలా బాగా చూపించాడు. అయితే హీరో క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకున్న దర్శకుడు తొలి భాగంలో చాలా సేపు రొటీన్‌ సన్నివేశాలతో బోర్‌ కొట్టించాడు. అసలు కథ మొదలైన తరువాత సినిమా వేగం అందుకుంటుంది. అయితే పూర్తిగా టెక్నాలజీకి సంబంధించిన కథ కావటంతో సామాన్య ప్రేక్షకులు ఏ మేరకు అర్థం చేసుకోగలరో చూడాలి. యువన్‌ శంకర్‌ రాజా థ్రిల్లర్‌ సినిమాకు కావాల్సిన ఇంటెన్స్‌ మ్యూజిక్‌ తో మెప్పించాడు. సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ సినిమాటోగ్రఫి. జార్జ్‌ సీ విలియమ్స్‌ తన కెమెరా వర్క్‌తో సినిమా మూడ్‌ను క్యారీ చేశారు. అయితే ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. తొలి భాగంలో అనవసర సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :
అర్జున్‌ నటన
నేపథ్య సంగీతం
సినిమాటోగ్రఫి

మైనస్ పాయింట్స్ :
తొలి భాగంలో కొన్ని బోరింగ్‌ సీన్స్‌

- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌


Poll
Loading...
మరిన్ని వార్తలు