త్వరలో రానాతో సినిమా

25 Feb, 2017 11:29 IST|Sakshi
త్వరలో రానాతో సినిమా
అరసవల్లి : సినీ హీరో దగ్గుబాటి రామానాయుడు(రానా) త్వరలో ఓ క్లాసిక్‌ సినిమా తీస్తానని ప్రముఖ నిర్మాత, నటుడు కె.అశోక్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం తన భార్య ఉషారాణితో కలిసి అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. విక్టరీ వెంకటేష్‌ తర్వాత అంత స్థాయి నటుడిగా రానా రాణిస్తాడని, అందుకు అతడి విలక్షణ నటనే నిదర్శనమని చెప్పారు. తాను ఇంతవరకు 70 సినిమాలకు పైగా నటించానని, ఇప్పుడు సొంతంగా ప్రొడక్షన్‌ ప్రారంభించానని, ప్రస్తుతం మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు హీరోగా సినిమా చేస్తున్నానని, ఇప్పటికే 50 శాతం షూటింగ్‌ పూర్తయ్యిందని వివరించారు.
 
పదేళ్ల క్రితం చిన్న అనారోగ్య కారణాలతో ఇక్కడి అరసవల్లి సూర్యక్షేత్రానికి వచ్చానని, ఇక్కడే బస చేసి సూర్యనమస్కారాలు చేయించుకున్నానని, తర్వాత ఆరోగ్యం పొందానని గుర్తు చేసుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన దర్శన భాగ్యం కలిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో నటులకు కొదవలేదని, త్వరలో తెలుగు సిని ఇండస్ట్రీ దృష్టి ఈ ప్రాంతాల్లోని ప్రకృతి దృశ్యాలపై తప్పనిసరిగా పడుతుందన్నారు. 
 
కూర్మనాథునికి పూజలు 
శ్రీకూర్మంలోని కూర్మనాథున్ని సినీనటుడు అశోక్‌ సతీసమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ముందుగా మూలవిరాట్‌ను దర్శించుకున్న అనంతరం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు కిషోర్‌శర్మ ఆలయ చరిత్రతో పాటు రెండు ధ్వజస్తంభాలు, అష్టదళాపద్మాకారం, వైష్ణోదేవి ఆలయం, ఆకుపసర చిత్రాల విశేషాలు వివరించారు. ఆయనతో పాటు సర్పంచ్‌ బరాటం రామశేషు ఉన్నారు.