చేదు అనుభవాలెన్నో!

29 May, 2020 07:41 IST|Sakshi
కల్యాణి

సినిమా: చేదు అనుభవాలెన్నో ఎదుర్కొన్నానని నటి కల్యాణి చెప్పింది. కేరళకు చెందిన ఈ అమ్మడు తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. బాలనటిగా పరిచయమైన కల్యాణి కథానాయకి స్థాయికి ఎదిగింది. 10 చిత్రాలకు పైగా కథానాయకిగా నటించిన కల్యాణి ఆ తరువాత బుల్లితెరకు పరిచయమైంది. తరువాత బుల్లితెర నుంచి నిష్క్రమించింది. నటనకు దూరం కావడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు కల్యాణి బదులిస్తూ నేనని ఠక్కున చెప్పింది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థల్లో నుంచి ఫోన్లు వచ్చేవని, తమ చిత్రంలో కథానాయకి మీరేనని చెప్పేవారని అంది.

అందుకు సంతోషపడే లోపే అడ్జెస్ట్‌మెంట్‌ కావాలని చెప్పేవారన్నారు. అదేది కాల్‌షీట్స్‌కు సంబంధించిన పదం అనుకుని తన తల్లి ఓకే చెప్పేదని ఆ తరువాత విషయం అర్థం తెలియడంతో అడ్జెస్ట్‌మెంట్‌ అన్న పదం వినగానే ఫోన్‌ కట్‌ చేశానని చెప్పింది. సినిమాలోనే కాదు బుల్లితెరలోనూ అలాంటి చేదు అనుభవాలను చాలా ఎదుర్కొన్నట్లు చెప్పింది. ఒక టీవీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నత బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి రాత్రికి పబ్బుకు పిలిచారని, అందుకు తాను సాయంత్రం కాపీ షాప్‌లో కలుసుకుందామని చెప్పానని అంది. అంతే ఆ తరువాత ఆ టీవీలో ఏ కార్యక్రమంలోనూ తనకు అవకాశం రాలేదని చెప్పింది. దీని కారణంగా తాను నటనకు దూరమైనట్లు నటి కల్యాణి చెప్పింది. ప్రస్తుతం ఈమె పెళ్లిచేసుకుని సంసారజీవితంలో మునిగిపోయింది.

మరిన్ని వార్తలు