చీకటి కోణాలు

11 Oct, 2018 02:20 IST|Sakshi
ఐశ్వర్యారాయ్‌

ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దేశంలో ‘మీ టూ’ ఉద్యమం ఎంతటి ప్రకంపనలు సృష్టిస్తుందో తెలిసిందే. ప్రస్తుతం చిత్రసీమలో చర్చలన్నీ లైంగిక వేధింపుల గురించే. ఇప్పటికే కొందరు ఫీమేల్‌ ఆర్టిస్టులు తమకు ఎదురైన చేదు అనుభవాలను సోషల్‌ మీడియా ద్వారా వ్యక్తపరిచారు. ఈ విషయంలో బాధిత నటీమణులకు సహచర నటీమణుల నుంచి మాత్రమే కాదు.. కొందరు నటులు, దర్శకులు కూడా మద్దతు ఇస్తున్నారు. తాజాగా ఈ విషయంపై ఐశ్వర్యారాయ్‌ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘‘వేధింపులకు సంబంధించి బాధిత మహిళలు తమ అనుభవాలను బయటకు చెప్పినప్పుడు వాటిని మనం కూడా ధైర్యంగా ఇతరులతో షేర్‌ చేసుకోవాలి. మహిళపై వేధింపుల సమస్య కేవలం ఇప్పటిది మాత్రమే కాదు. ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు వేధింపుల గురించి ఓ ఉద్యమం నడుస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఇలాంటి విషయాలపై మాట్లాడటానికి నేను సంకోచించను. గతంలో మాట్లాడాను.

ఇప్పుడు  మాట్లాడుతున్నా. భవిష్యత్‌లో మాట్లాడతాను. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు తమ గొంతును వినిపించడానికి సోషల్‌ మీడియా ఉపయోగపడుతోంది’’ అని పేర్కొన్నారు. అయితే లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడు వికాస్‌ బాల్, అలోక్‌నాథ్‌ల గురించి మీ ఒపీనియన్‌ ఏంటి? అని మీడియా అడిగితే.. ఆ విషయం గురించి చెప్పకుండా ఐశ్వర్య మాట దాటేశారు. దోషులను చట్టం శిక్షిస్తుందన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... తనుశ్రీ దత్తా, నానా పటేకర్‌ల వివాదం మరో స్థాయికి  చేరింది. ఇటీవల తనుశ్రీకి నానా పటేకర్‌ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. తాజాగా తనుశ్రీ దత్తా లాయర్‌లు ముంబై పోలీసులు, మహారాష్ట్ర స్టేట్‌ కమిషన్‌ ఫర్‌ ఉమెన్‌లకు దాదాపు 40 పేజీల ప్రతులను అందజేశారు. తనుశ్రీ  వివాదానికి సంబంధించి నటుడు నానా పటేకర్, నిర్మాత సమి సిద్ధిఖీ, కొరియోగ్రాఫర్‌ గణేశ్‌ ఆచార్య, దర్శకుడు రాకేష్‌ సారంగ్‌లు పది రోజుల్లో సంజాయిషీ చెప్పాల్సిందిగా ముంబై రాష్ట్ర మహిళా విభాగం మంగళవారం నోటీసులు పంపించిన విషయం తెలిసిందే.

క్షమాపణలు చెప్పాల్సిందే!
 ఫాంథమ్‌ ఫిల్మ్స్‌ నిర్మాణ సంస్థలో ఒకరైన వికాశ్‌ బాల్‌పై లైంగిక ఆరోపణలు వచ్చిన తర్వాత మిగిలిన ముగ్గురు (అనురాగ్‌ కశ్యప్, విక్రమాదిత్య, మధు మంతెన)లు ఆ సంస్థను నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అనురాగ్‌ కశ్యప్, విక్రమాదిత్యలు వికాస్‌పై సోషల్‌æమీడియా ద్వారా పలు ఆరోపణలు చేశారు. దీంతో అనురాగ్, విక్రమాదిత్యలకు తాజాగా నోటీసులను పంపించారు వికాస్‌.


‘‘నా గురించి అనురాగ్, విక్రమాదిత్య చేసిన ఆరోపణలను వెనక్కు తీసుకోవాలి. క్షమాపణలు చెప్పాలి. వృత్తిపరమైన అసూయ కారణంగానే నాపై అనురాగ్, విక్రమాదిత్య ఇలాంటి ఆరోపణలు చేశారనిపిస్తోంది. అలాగే నా కెరీర్‌ను, ఇమేజ్‌ను దెబ్బతీయాలనే ఇలా ప్లాన్‌ చేశారు. నాపై వచ్చిన ఆరోపణలు నిజమో కాదో తెలియకుండానే పాంథమ్స్‌ ఫిల్మ్స్‌ను నిర్వీర్యం చేశారు. ఇందుకు నాపై వచ్చిన ఆరోపణలను వారు ఒక సాకుగా చూపించారన్నది నా ఆలోచన’’ అంటూ మూడు పేజీల లీగల్‌ నోటీసును అనురాగ్, విక్రమాదిత్యలకు పంపారు వికాస్‌ తరఫు లాయర్‌. మరోవైపు వికాస్‌ నోటీసుల విషయమై తనపై పడ్డ నింద తొలగిపోయేంత వరకు ముంబై అకాడమీ ఆఫ్‌ ది మూవీంగ్‌ ఇమేజ్‌ బోర్డ్‌ (ఎమ్‌ఎఎమ్‌ఐ) సభ్యత్వాన్ని అనురాగ్‌ కశ్యప్‌ రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. ఈ సంగతి ఇలా ఉంచితే... వికాస్‌పై వచ్చిన ఆరోపణలు అతన్ని రెండు ప్రాజెక్ట్‌లకు దూరం చేశాయని తెలుస్తోంది.

అపస్వరం!
సింగర్‌గా పలు హిట్‌ పాటలను ఆలపించి శ్రోతల మనసును గెల్చుకున్న కైలాష్‌ ఖేర్‌ తాజాగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వృత్తిపరమైన విషయాలను చర్చించే సమయంలో కైలాష్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించారని గాయని సోనా మల్హోత్రా ఆరోపించారు. ఓ ఇంటర్య్వూ నిమిత్తం సింగర్‌ కైలాష్‌ ఖేర్‌ను కలవడానికి వెళ్లిన సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని సోషల్‌ మీడియా వేదికగా ఓ జర్నలిస్ట్‌ కూడా ఆరోపించారు. తెలుగులో పండగలా దిగి వచ్చాడు (మిర్చి), ‘వచ్చాడయ్యో సామీ..’ (భరత్‌ అనే నేను),  ‘యాడపోయినాడో..’ (అరవిందసమేత వీరరాఘవ) వంటి హిట్‌ సాంగ్స్‌ను పాడారు కైలాష్‌. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ ఏడాది దాదాపు అరడజను తెలుగు సినిమాలకు సంగీతం అందించి, మంచి ఫామ్‌లో దూసుకెళ్తున్నారు మలయాళ మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపీ సుందర్‌. ప్రస్తుతం ‘మీ టూ’ ఉద్యమంలో ఆయన పేరు కూడా వినిపిస్తోంది. తనను లైంగికంగా వేధించారని ఓ సింగర్‌ సోషల్‌ మీడియా ద్వారా ఆరోపించారు. చక్కని స్వరం ఉన్న ఈ గాయకులపై ఇలాంటి ఆరోపణలు ‘అపస్వరం’గా అనిపిస్తున్నాయని పలువురు అనుకుంటున్నారు.

భార్యను వేధించిన దర్శకుడు!
మరోవైపు మరాఠీ చిత్రం ‘సైరాట్‌’తో దేశవ్యాప్త గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు నాగరాజ్‌ మంజులేపై ఆయన మాజీ భార్య సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నా 18ఏళ్ల వయసులో నాగరాజ్‌తో నాకు వివాహం జరిగింది. ఆ సమయంలో దర్శకునిగా పేరు తెచ్చుకోవాలని నాగరాజ్‌ ఎంతగానో ప్రయత్నిస్తుండే వాడు. ఇంటికి నేనే పెద్ద కోడలిని. మా సంసారంలో వచ్చిన ఎన్నో సమస్యలను నేను ఎదుర్కొన్నాను. ఒక టైమ్‌లో నాగరాజ్‌ ప్రవర్తన హద్దులు దాటింది. ఇంటికి అమ్మాయిలను తెచ్చుకునేవాడు. పైగా నన్ను అబార్షన్‌ చేయించుకోమని వేధించాడు. రెండు, మూడుసార్లు చేయించాడు కూడా. ఇక భరించలేక 2014లో అతన్నుంచి విడిపోయాను’’ అని సునీత చెప్పినట్లు ఇప్పుడు తాజాగా వార్తలు వస్తున్నాయి. నటి అమైరా దస్తూర్‌ కూడా మూవీ లొకేషన్‌లో వేధింపులు ఎదుర్కొన్నానని పేర్కొన్నట్లు చెబుతున్నారట. ‘‘సౌత్, నార్త్‌ ఇండస్ట్రీలో  నేను లైంగిక దాడులను ఎదుర్కొనలేదు. కానీ వేరే రకమైన వేధింపులకు గురయ్యాను. వాళ్ల పేర్లు చెప్పడానికి ప్రస్తుతం నాకు ధైర్యం సరిపోవడం లేదు’’ అన్నారు అమైరా. మొత్తానికి మీటూ ఎన్నో చీకటి కోణాలను బయటకు తెస్తోందని, ఇంకా ఎవరెవరి పేర్లు వస్తాయోననే చర్చ జరుగుతోంది.

ఇప్పుడిదొక ఫ్యాషన్‌!
గాయని చిన్మయి ‘మీటూ’కి సంబంధించిన మరికొన్ని ట్వీట్స్‌ను బుధవారం  సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. మంగళవారం ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు గురించి ఆమె ట్వీట్స్‌ చేశారు.  బుధవారం వైరముత్తు స్పందిస్తూ – ‘‘అమాయకులను అవమానించడం ఇప్పుడు చాలామందికి ఓ ఫ్యాషన్‌ అయిపోయింది. గతంలో నా మీద చాలా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఇది. నిజమేంటో కాలమే చెబుతుంది’’ అన్నారు. ఈ విషయంపై చిన్మయి సోషల్‌ మీడియాలో స్పందిస్తూ.. ‘వైరముత్తు అవాస్తవాలు చెబుతున్నారు’ అని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు