పౌరసత్వం వివాదం.. మద్దతు తెలిపిన కిరెన్‌ రిజ్జూ

8 May, 2019 11:42 IST|Sakshi

గత కొద్ది కాలంగా దేశవ్యాప్తంగా బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ పౌరసత్వం గురించి చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అక్షయ్‌ ఓటు వేయకపోవడంతో ఈ వివాదం తెరమీదకు వచ్చింది. దీనిపై స్పందించిన అక్షయ్‌.. తన పౌరసత్వం గురించి ఎలాంటి చర్చ అవసరం లేదన్నారు. దేశం పట్ల తనకు ఉన్న ప్రేమను ఇప్పుడు నిరూపించుకోవాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేశారు. తాజాగా ఈ వివాదంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్‌ రిజ్జూ అక్షయ్‌కు మద్దతుగా నిలిచారు. అక్షయ్‌ దేశభక్తిని శంకించాల్సిన అవసరం లేదన్నారు కిరెన్‌.

ఈ మేరకు ‘అక్షయ్‌.. మీ దేశ భక్తిని ఎవరూ శంకించలేరు. సాయుధ దళాల సిబ్బంది చనిపోయినప్పుడు మీరు స్పందించిన తీరు.. వారిని ఆదుకోవడం కోసం ‘భారత్‌కేవీర్‌’ కార్యక్రమం ద్వారా మీరు విరాళాలు సేకరించిన విధానం దేశభక్తి కలిగిన ఓ భారతీయుడికి అసలైన ఉదాహరణగా నిలుస్తుందం’టూ కిరెన్‌ రిజ్జూ ట్వీట్‌ చేశారు. దాంతో అక్షయ్‌ ట్విటర్‌ ద్వారా కిరెన్‌ రిజ్జూకు ధన్యవాదాలు తెలిపారు. ‘మీకు ధన్యవాదాలు తెలపడంలో ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి కిరెన్‌ రిజ్జూ సర్‌. నా పట్ల మీరు చూపిన అభిమానానికి ధన్యవాదాలు. భారత ఆర్మీ పట్ల, ‘భారత్‌కేవీర్‌’ కార్యక్రమం పట్ల నా బాధ్యత ఎప్పటికి స్థిరంగా నిలిచి ఉంటుందం’టూ అక్షయ్‌ రీట్వీట్‌ చేశారు.

బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ కూడా పౌరసత్వం విషయంలో అక్షయ్‌కు మద్దతుగా నిలిచారు. తన పౌరసత్వం వివాదం గుర్చి స్పందిస్తూ అక్షయ్‌ తన దగ్గర కెనడా పాస్‌పోర్ట్‌ ఉందన్నారు. కానీ  గత ఏడేళ్లగా ఒక్కసారి కూడా కెనడా వెళ్లలేదని తెలిపారు. ఇండియా ప్రగతి పథంలో ముందుకు వెళ్లడానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు అక్షయ్‌.

మరిన్ని వార్తలు