కరోనా.. మూడు రాష్ట్రాలకు బన్నీ విరాళం

27 Mar, 2020 12:33 IST|Sakshi

కరోనా వైరస్‌పై పోరాటానిక తీసుకుంటున్న చర్యలకు పలువురు సినీ ప్రముఖులు తమ వంతు సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ కూడా కరోనాపై పోరాటానికి రూ. 1.25కోట్లు విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు కలిపి ఈ మొత్తాన్ని అందజేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ‘కోవిడ్‌-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. అంతేకాకుండా మన రోజువారి జీవితాల్ని మార్చేసింది. ఇలాంటి సమయంలో వైద్యులు, నర్సులు, మిలటరీ, పోలీసులు, ఇలా మన కోసం ఎంతగానో కష్టపడుతున్న వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంది. వారి స్ఫూర్తితో నా వంతుగా చిన్నపాటి సాయం చేయాలనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ ప్రభుత్వాలకు రూ. 1.25 కోట్లు విరాళంగా ఇస్తున్నాను. చేతులను తరుచు కడుక్కోవడం, స్వీయ నిర్బంధంలో ఉండటం ద్వారా మనం కరోనా వ్యాప్తిని నివారించవచ్చు. అతి త్వరలోనే కరోనా అంతమవ్వాలని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. కాగా, తెలుగు రాష్ట్రాలతోపాటు కేరళలో కూడా అల్లు అర్జున్‌కు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే.  గతంలో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కూడా అల్లు అర్జున్‌ తనవంతు సాయాన్ని అందించారు.

రూ. 10 లక్షలు విరాళం ప్రకటించిన సుకుమార్‌..
ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్‌ కూడా కరోనాపై పోరాటానికి తన వంతు సాయం అందించారు. తెలుగు రాష్ట్రాలకు రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ. 5 లక్షల చొప్పును విరాళం ఇవ్వనున్నట్టు తెలిపారు. త్వరలోనే ఈ మొత్తాన్ని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అందజేయనున్నట్టు చెప్పారు. 

చదవండి : చరణ్‌ విషయంలో అలా అనిపించింది : చిరు

రూ. 20 లక్షల విరాళమిచ్చిన చినబాబు
ప్రముఖ నిర్మాత చినబాబు(ఎస్‌ రాధకృష్ణ) కూడా కరోనాపై పోరాటానికి తనవంతు సాయంగా రూ. 20లక్షల విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలకు రూ. 10లక్షల చొప్పున విరాళం అందజేయనున్నట్టు తెలిపారు. ఇటువంటి కష్ట సమయాల్లో అవసరం ఉన్నవారికి సాయపడటం మన బాధ్యత అని అన్నారు. 

మరిన్ని వార్తలు