అమితాబ్..అరడజను శత్రువులు

17 Oct, 2016 23:07 IST|Sakshi
అమితాబ్..అరడజను శత్రువులు

అమితాబ్ బచ్చన్ హీరోగా ‘సర్కార్’, ‘సర్కార్ రాజ్’ తీసిన రామ్‌గోపాల్ వర్మ ఆ సినిమాలకు  కొనసాగింపుగా తెరకెక్కిస్తున్న మూడో చిత్రం ‘సర్కార్ 3’. తనకెంతో ఇష్టమైన హాలీవుడ్ చిత్రం ‘గాడ్ ఫాదర్’ స్ఫూర్తితో ‘సర్కార్’ ఫ్రాంచైజీలో చిత్రాలను తెరకెక్కిస్తున్నారు వర్మ. అమితాబ్ నటించిన సుభాష్ నాగరే పాత్రను శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాకరే తరహాలో ప్రజెంట్ చేశారు. మూడో చిత్రంలోనూ ఆయన సుభాష్ నాగరేగా కనిపించనున్నారు.
 
 ఇక అమితాబ్ కుమారుడు అభిషేక్, కోడలు ఐశ్వర్యా రాయ్‌లు ‘సర్కార్ 3’లో నటించడం లేదని వర్మ స్పష్టం చేశారు. ఈ చిత్రంలో ముఖ్యమైన నటీనటుల ఫస్ట్ లుక్స్‌ను వర్మ విడుదల చేశారు. ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ ఇందులో మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. చిత్రంలో ఆయన్ను అందరూ ‘సర్’ అని సంభోదిస్తారట. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో వెంకటేశ్, మహేశ్‌బాబులకు నానమ్మగా నటించిన రోహిణీ హట్టంగడి ఈ చిత్రంలో రక్కుబై దేవిగా విలనిజం చూపించనున్నారు. గోరక్ రాంపూర్‌గా రెండు పార్శ్వాలున్న పాత్రలో భరత్ దభోల్కర్... తన తండ్రి చావుకి కారణమైన సుభాష్ నాగరేపై ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూసే పాత్రలో హీరోయిన్ యామీ గౌతమ్.. సుభాష్ నాగరే  అనుచరుడిగా రోనిత్ రాయ్ నటిస్తున్నారని వర్మ తెలిపారు.

 
 అత్యంత క్రూరుడైన శివాజీ అలియాస్ చీకు పాత్రలో యువ నటుడు అమిత్ సాద్ కనిపించనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరహా పాత్రను మనోజ్ బాజ్‌పాయ్ చేయనున్నారు. ‘‘కాకపోతే.. ఇది కాస్త వయొలెంట్ వెర్షన్’’ అన్నారు వర్మ. ‘‘మనోజ్ అద్భుతమైన నటుడే కానీ అరవింద్ కేజ్రీవాల్ కంటే నటనలో చాలా చిన్నోడు’’ అని వర్మ వ్యాఖ్యానించడం కొసమెరుపు. రోనిత్ రాయ్ మినహా వర్మ పరిచయం చేసిన మిగతా ఆరు పాత్రలూ ప్రతినాయక ఛాయలున్నవి కావడం గమనార్హం. సో.. ఇందులో అమితాబ్‌కు మొత్తం అరడజను మంది విలన్లు ఉంటారన్నమాట.