నంబర్ పాత్రలతో యానిమేషన్ చిత్రం

31 May, 2014 00:16 IST|Sakshi
నంబర్ పాత్రలతో యానిమేషన్ చిత్రం

ప్రయోగాత్మక, చిత్రాలకిప్పుడు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ తమిళ సినిమా, మరో అంతస్తుకు చేరుకుంటోంది. ఇటీవల తెరపైకి వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో 3డి ఫార్మెట్‌లో రూపొంది అశేష అభిమానుల్ని అలరిస్తోంది. తాజాగా 029 అనే మరో యానిమేషన్ చిత్రం తమిళ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినివ్వడానికి సిద్ధం అవుతోంది. ఇది జీరో నుంచి తొమ్మిది అంకెల పేరుతో పాత్రలు తెరకెక్కించిన వినూత్న ప్రయోగాత్మక యానిమేషన్ చిత్రం.

టీఎఫ్‌ఎస్‌ఎస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహిళా దర్శక నిర్మాత బి.నిషా తెరపై ఆవిష్కరించిన చిత్రం 029. ఇలా సంఖ్య పేర్లతో పాత్రల రూపకల్పన చేసి చిత్రం చేయడం అనేది ప్రపంచంలోనే తొలి ప్రయత్నం అవుతుంది. ఈ కథ ప్రేమ, రొమాన్స్, హాస్యం, యాక్షన్ అంటూ జనరంజక అంశాలన్నీ చోటు చేసుకుంటాయంటున్నారు. దర్శక నిర్మాత బి.నిషా. ఈమె చిత్రం గురించి మాట్లాడుతూ, 100 నుంచి 150 మంది సాంకేతిక నిపుణులు ఆరేడేళ్లు, రేయింబవ ళ్లు శ్రమించి రూపొందించిన చిత్రం 029 అని తెలిపారు.

తమిళ సినిమాలో ఒక కొత్త ప్రయోగం చేశామన్నారు. ఫలితం ఉంటుందని ఆశిస్తున్నామని చెప్పారు. ఈ చిత్రాన్ని ముఖ్యంగా పిల్లలకు నచ్చే విధంగా రూపొందించామన్నారు. పెద్దలు మెచ్చే విధంగా 029 యానిమేషన్ చిత్రం ఉంటుందన్నారు. 3డి యానిమేషన్‌లో రూపొందిన కోచ్చడయాన్ చిత్రం విశేష ప్రజాదరణ పొందుతోందన్నారు. ఆ చిత్ర మైలేజ్ తమ చిత్రానికి ఉపయోగపడుతుందనే ఆశాభావాన్ని దర్శక నిర్మాత బి.నిషా వ్యక్తం చేశారు. విజయ్ రమేష్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి మిరకిల్ పీటర్ యానిమేషన్‌ను రూపొందించారు. చిత్రాన్ని మిస్బా యాడ్ సంస్థ మార్కెటింగ్ చేయనుంది.