అనుష్కకు నోటీసులు..‘తప్పు చేయలేదు’

10 Apr, 2017 14:55 IST|Sakshi
అనుష్కకు నోటీసులు..‘తప్పు చేయలేదు’

ముంబయి: ప్రముఖ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ప్రేయసి అనుష్క శర్మకు బృహణ్‌ ముంబయి కార్పొరేషన్‌ నోటీసులు పంపించింది. నలుగురు నడిచే దారిలో తన ఇంటికోసం ఎలక్ట్రిక్‌ జంక్షన్‌ బాక్స్‌ ఏర్పాటుచేయడం, అది కూడా ముందస్తు అనుమతి లేకుండా దానిని పెట్టడంతో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. అయితే, అనుష్క శర్మ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇచ్చింది. సుబర్బన్‌ వార్సోవా ప్రాంతంలో బద్రినాథ్‌ టవర్‌ హౌసింగ్‌ సొసైటీలోని 20వ అంతస్తులో అనుష్క శర్మ ఉంటోంది.

అయితే, తన ఫ్లాట్‌కోసం నలుగురు నడిచే మార్గంలో ఎలక్ట్రిక్‌ బాక్స్‌ ఏర్పాటుచేసినట్లు అదే హౌసింగ్‌ సొసైటీలో ఉంటున్న వ్యక్తి బీఎంసీకి ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు ఈ విషయం ముందుగా తమకు ఎందుకు తెలియజేయలేదో వివరణ ఇవ్వాలని, ఉన్నపలంగా ఎలక్ట్రిక్‌ బాక్స్‌ అక్కడి నుంచి తొలగించాలని, లేదంటే తగిన విధంగా చర్యలు తీసుకుంటామని బీఎంసీ హెచ్చరించింది.

అయితే, నోటీసులను అనుష్క శర్మ పేరిట పంపించకుండా ఫ్లాట్‌ నెంబర్‌ 2001, 2002 అని పేర్కొంటూ పంపించారంట. దీనికి సంబంధించి నటి తరుపున అధికార ప్రతినిధి స్పందిస్తూ తమ చట్ట విరుద్ధంగా ఏదీ చేయలేదని, అనుష్కకు మొత్తం మూడు ఫ్లాట్‌లు ఉన్నాయని, 2013 నుంచి అన్ని అనుమతులను తీసుకొని అందులో ఉంటున్నారని, ఏ ఒక్కరికీ హానీ చేసే కుటుంబం వారిది కాదని, చట్టానికి నిబద్ధులై ఉంటారని చెప్పాడు.