-

సోలార్‌ రూఫ్‌.. రేటు టాప్‌!

27 Nov, 2023 04:41 IST|Sakshi

దేశంలో ఇళ్లపై రూఫ్‌ టాప్‌ సామర్థ్యం 2.7 గిగావాట్స్‌ మాత్రమే..

రూఫ్‌ టాప్‌ కంటే సంప్రదాయ విద్యుత్‌ ధరలే తక్కువ

‘థింక్‌ట్యాంక్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌’ వెల్లడి

సాక్షి, అమరావతి: థర్మల్, హైడల్, విండ్, గ్యాస్, బయోమాస్‌ ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌తో పోల్చితే.. ఇళ్ల పైకప్పులపై పెట్టుకునే సోలార్‌ రూఫ్‌టాప్‌ ఖరీదే ఎక్కువని తాజాగా ఓ అధ్యయనం తేచ్చింది. పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడం కోసం ఇళ్ల పైకప్పులపై దాదాపు 40 గిగావాట్ల సౌర పలకలను అమర్చాలని కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

కానీ ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో కలిపి రూఫ్‌టాప్‌ సామ­ర్థ్యం 11 గిగావాట్లు కాగా, నివాస గృహాల­పై ఉన్నది 2.7 గిగావాట్లు మాత్రమే. దీనికి కారణం ఖర్చు ఎక్కువ కావడమేనని అధ్యయనంలో వెల్లడైంది. ఏపీ సహా 21 రాష్ట్రాల్లోని 14వేల గృహాలపై అధ్యయనం చేసిన థింక్‌ ట్యాంక్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌ (ఢిల్లీ) పరిశోధకులు దేశంలో సబ్సిడీలు ఇస్తున్నా సోలార్‌ రూఫ్‌టాప్‌ సిస్టం ఏర్పా­టు ఇప్పటికీ ఖరీదైనదిగానే ఉందని తెలిపారు. 

రూఫ్‌టాప్‌ ఖర్చు, సబ్సిడీ ఇలా..  
విద్యుత్‌ వినియోగదారుల్లో దాదాపు 85 శాతం మంది ఏడాదికి 1,200 యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. ఎవరైనా తమ ఇంటిపై రూఫ్‌టాప్‌ సిస్టం ఏర్పాటు చేయాలంటే ప్రతి కిలోవాట్‌కు 100 చ.అ. స్థలం ఉండాలి. ఒక కిలోవాట్‌కు రూ.50 వేలు, ఒక కిలోవాట్‌పైన 2 కిలోవాట్ల వరకు కిలోవాట్‌కి రూ.47 వేలు, 2 కిలోవాట్ల పైబడి 3 కిలోవాట్ల వరకు కిలోవాట్‌కు రూ.45 వేలు, 3 కిలోవాట్ల పైన 10 కిలోవాట్ల వరకు కిలోవాట్‌కి రూ.44 వేలు, 10 కిలోవాట్ల పైబడి 100 కిలోవాట్ల వరకు కిలోవాట్‌కి రూ.38,000, వంద కిలోవాట్లపైన 500 కిలోవాట్ల వరకు కిలోవాట్‌కు రూ.36 వేలు ఖర్చవుతుంది.

వీటికి అదనంగా దర­ఖాస్తు రుసుం 5 కిలోవాట్ల వరకు రూ.1,000, ఆ పైన రూ.5వేలు చొప్పున చెల్లించాలి. మీటరింగ్‌ చార్జీలు అదనం. ఈ ధరలు చెల్లించిన వారికి సోలార్‌ రూఫ్‌ టాప్‌ ప్లాంట్ల రూపకల్పన, సరఫరా, ఏర్పాటు చేసి ఇవ్వడంతో పాటు బీమాతో సహా ఐదేళ్ల వారంటీ లభిస్తుంది. 3 కిలోవాట్ల వరకు 40%, 3 కిలోవాట్ల పైబడి 10 కిలో వాట్ల కంటే ఎక్కువ సోలార్‌ రూఫ్‌టాప్‌ వ్యవస్థలపై 20% సబ్సిడీ వస్తుంది. రూఫ్‌టాప్‌ సోలార్‌ యోజన స్కీం ను 2026 మార్చి 31 వరకు కేంద్రం పొడిగించింది.

మన దగ్గర మెరుగు
ప్రజలు తమ గృహ, వాణిజ్య అవసరాలకు సౌర విద్యుత్‌­ను వినియోగించుకునేందుకు వీలుగా సోలార్‌ రూఫ్‌ టాప్‌ పాలసీ(ఎస్‌ఆర్‌టీ)ని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిం­ది. దీనికి అను­గుణంగా ఎవరైనా తమ నివాస, వాణిజ్య భవనంపై సోలా­ర్‌ పలకలు పెట్టుకోవచ్చు. సోలార్‌ పలకలు బిగించాక ఉత్పత్తి అయిన విద్యుత్‌ను వారి అవసరానికి వాడుకోగా, మిగిలినది గ్రిడ్‌కు ఎగుమతి చేయొ­చ్చు. దానిని డిస్కంలు తమ మీటరు ద్వారా రికార్డ్‌ చేస్తా­యి.

వినియోగదారుడు ఎగుమతి చేసిన యూనిట్లకు ఏపీఈఆర్‌సీ నిర్ణ­యించిన పూల్‌ కాస్ట్‌ ధర(రూ.4.60 పైసలు)­ను డిస్కంలు చెలి­్లస్తున్నాయి. దీనివల్ల రూఫ్‌టాప్‌ నిర్వాహకులకు ప్రయోజనం చేకూరుతోంది. అటు డిస్కంలు కూడా నెట్‌ మీటరింగ్‌ ద్వారా రూఫ్‌టాప్‌ సోలార్‌ సిస్టంల నుంచి ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ‘రెన్యూవబుల్‌ పవర్‌ పర్చేజ్‌ ఆబ్లి­గేషన్‌ (ఆర్‌పీఓ) లక్ష్యంలో చూపించుకునే వెలు­సుబా­టు మన రాష్ట్రంలో ఉంది. 

మరిన్ని వార్తలు